శుక్రవారం 10 జూలై 2020
National - Jun 18, 2020 , 02:00:09

రోదన మిగిల్చినా.. గర్వమే

రోదన మిగిల్చినా.. గర్వమే

కోల్‌కతా: తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. చెల్లి పెండ్లికి ఉంది. ఆ ఒక్కడు సంపాదించేదే కుటుంబం మొత్తానికి జీవనాధారం. చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన రాజేశ్‌ ఒరంగ్‌ కుటుంబ పరిస్థితి ఇది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజేశ్‌ ఆరేండ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. దేశం కోసం ధైర్యంగా ప్రాణాలర్పించిన కుమారుడు తమను గర్వపడేలా, తలెత్తుకునేలా చేశాడని దీపక్‌ తల్లిదండ్రులు చెప్పారు.

కలలుగన్న ఇంట్లోకి అడుగు పెట్టకుండానే!

భార్యాపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఇటీవలే ఇల్లు కట్టించాడు. కానీ ఆ జవాను తను కలలుగన్న ఇంటిలో అడుగుపెట్టకుండానే అమరుడయ్యాడు. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన పళని దేశ రక్షణలో వీరమరణం పొందారు. 

నీకోసం కశ్మీర్‌ శాలువా తీసుకొస్తా!

ఎనిమిది నెలల క్రితమే పెండ్లి అయింది. ఇటీవలే భార్యకు ఫోన్‌ చేసి.. ‘లీవ్‌ మీద వస్తాను. నీ కోసం కశ్మీర్‌ శాలువా పట్టుకువస్తాను’ అని సంతోషంగా చెప్పాడు. కానీ సోమవారం రాత్రి చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్లలో దీపక్‌ సింగ్‌ ఒకరు. మధ్యప్రదేశ్‌  రేవాలోని ఫరేడా ఆయన స్వస్థలం. 

కన్న బిడ్డను చూడలేకపోయాడు

పదిహేడు రోజుల కింద బిడ్డ పుట్టింది. పది రోజుల క్రితం తల్లి ఫోన్‌ చేస్తే..  లీవ్‌ తీసుకొని ఇంటికి వస్తానని కూడా చెప్పాడు. అదే ఆఖరు. ఇక తన కుటుంబంతో మాట్లాడలేదు జార్ఖండ్‌కు చెందిన కుందన్‌ కుమార్‌ ఓఝా. గల్వాన్‌ లోయలో అమరుడైన కుందన్‌ కుమార్‌ వయస్సు 28 ఏండ్లు. 


logo