శుక్రవారం 10 జూలై 2020
National - Jun 21, 2020 , 02:16:26

సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు

సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోహరింపు

  • సుఖోయ్‌, అపాచీ, చినూక్‌, మిగ్‌, జాగ్వార్‌ల గస్తీ
  • ట్యాంకర్లలో లడఖ్‌కు తరలుతున్న అదనపు ఇంధనం
  • ఆయుధాల వాడకంపై సైనికులకు పూర్తి స్వేచ్ఛ

న్యూఢిల్లీ, జూన్‌ 20: సరిహద్దుల్లో దొంగదెబ్బ తీస్తున్న చైనాను ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధమవుతున్నాయి. వాయుసేనలోని అత్యాధునిక యుద్ధవిమానాలన్నీ మంచుకొండలపై డేగకండ్లతో పహారా కాస్తున్నాయి. గల్వాన్‌ ఘటన తర్వాత చైనా నుంచి ఎలాంటి దాడి ఎదురైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాయి.  బలగాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ప్రభుత్వ చమురు సంస్థలు లడఖ్‌కు తరలిస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంట ఆయుధాలు వాడరాదన్న నియమాన్ని సడలించిన ప్రభుత్వం, సేనలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, బంగాళాఖాతంలోకి అదనంగా యుద్ధనౌకలను పంపుతున్నారు.

అదనపు ఇంధనం.. ఆయుధ సంపత్తి

భారత్‌- చైనా పశ్చిమ సరిహద్దుల్లో వాయుసే భారీ ఎత్తున యుద్ధవిమానాలను మోహరించింది. నూతన అపాచీ హెలికాప్టర్లు, చినూక్‌ హెవీ లిఫ్ట్‌ చాపర్లు కూడా లడఖ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సుఖోయ్‌-30ఎంకేఐ, మిగ్‌-29, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్లను కూడా సరిహద్దులకు పంపారు. ఇవి సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నాయి. సీ-17 గ్లోబ్‌మాస్టర్‌-3, సీ-130జే సూపర్‌ హెర్క్యూలస్‌, ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా చండీగఢ్‌ నుంచి లడఖ్‌ వరకు ‘ఎయిర్‌ బ్రిడ్జి’ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సైనికులను, ఆయుధ వ్యవస్థలను సరిహద్దులకు తరలించనున్నారు. యుద్ధవిమానాలు, ఇతర ఆయుధ వ్యవస్థలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ప్రభుత్వ చమురు సంస్థలు లడఖ్‌కు తరలిస్తున్నాయి. జమ్ము, శ్రీనగర్‌, జలంధర్‌ నుంచి రోజూ 100 ట్యాంకర్ల ద్వారా విమాన ఇంధనం, డీజిల్‌, కిరోసిన్‌ను లడఖ్‌, కార్గిల్‌, లేహ్‌కు చేరవేస్తున్నారు. మరోవైపు ఎల్‌ఏసీ వెంట ఆయుధాలు వాడరాదన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. అవసరం మేరకు ఆయుధాలు వాడేందుకు సైనిక కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

చైనా సైతం..

చైనా కూడా అదనపు బలగాలు, యుద్ధవిమానాలను మోహరిస్తున్నది. ముఖ్యంగా గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు, గోగ్రా-హాట్‌స్ప్రింగ్‌ ప్రాంతాల వద్ద బలగాలను పెంచింది. అలాగే ఫింగర్‌ 4-8 ప్రాంతాల మధ్య కొత్తగా సైనిక శిబిరాలను ఏర్పాటుచేసింది. టిబెట్‌లోని హోటన్‌, కష్‌గర్‌ వైమానిక స్థావరాల్లో యుద్ధ విమానాలను మోహరిస్తున్నది. అయితే చైనా వైమానిక స్థావరాలు ఎత్తయిన ప్రదేశంలో ఉండడం వల్ల అవి పరిమితంగానే ఆయుధాలను మోసుకుపోగలవు. 

మోదీ, జిన్‌పింగ్‌ రంగంలోకి దిగాల్సిందే

రాజకీయ చర్చలతోనే భారత్‌, చైనా సమస్య పరిష్కారం అవుతుందని చైనా విశ్లేషకుడు విక్టర్‌ గావో అభిప్రాయపడ్డారు. సరిహద్దులో నెలకొన్న ఘర్షణ అనంతర పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ చర్చలు జరపాలన్నారు. రాజకీయంగా చర్చలు జరిపితే ప్రజా శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి గురించి ఆలోచిస్తారని వెల్లడించారు. చైనా వైపు నుంచి ఎంతమంది సైనికులు మరణించారన్న విషయం వెల్లడించలేదని ఆయన్ను ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేశారు. భారత్‌, చైనా శత్రువులుగా మారితే ప్రపంచమే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు.

భారత్‌కు  ప్రపంచ దేశాల మద్దతు: జవాన్ల మృతిపై సంతాపం

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణ విషయంలో ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతున్నది. 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో శుక్రవారం రాత్రి సంతాపం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీలోని అమెరికా రాయబారి కెన్‌ జస్టర్‌ సైతం సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. జవాన్ల ధైర్యసాహసాలు మరువలేనివని ట్వీట్‌చేశారు. అమెరికా విదేశాంగ శాఖ ఇదివరకే సంతాపం తెలిపింది. భారత్‌-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహీద్‌ శనివారం ట్వీట్‌చేస్తూ.. జవాన్ల మృతిపై భారత ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌, బ్రెజిల్‌ కూడా భారత్‌కు మద్దతు ప్రకటించాయి. భారత్‌లోని ఆయా దేశాల రాయబారులు.. భారత సైనికుల మృతిపై సంతాపం ప్రకటించారు. logo