మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 13:44:06

చలిలోనూ చైనాను ఎదుర్కొనే యుద్ధట్యాంకుల మోహరింపు

చలిలోనూ చైనాను ఎదుర్కొనే యుద్ధట్యాంకుల మోహరింపు

న్యూఢిల్లీ: సరిహద్దులో ఒకవైపు చైనా ఆగడాలను మరోవైపు చలికాలన్ని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సన్నద్ధమైంది. తూర్పు లడఖ్‌ సరిహద్దులో వాస్తవాధీన రేఖకు సమీపంలోని చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో టీ-90, టీ-72 ట్యాంకులతోపాటు బీఎంపీ-2 పదాతిదళ పోరాట వాహనాలను మోహరించింది. ఇవి ఏ కాలంలోనైనా, మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ వంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనా పని చేస్తాయి. కఠినమైన శీతాకాలంలో గడ్డకట్టకుండా ఉండటానికి భారత ఆర్మీ మూడు రకాల వివిధ ఇంధనాలను వినియోగిస్తున్నది.

కాగా, లడఖ్‌లో శీతాకాలం కఠినంగా ఉంటుందని 14 కార్ప్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అరవింద్ కపూర్ తెలిపారు. ఇక్కడి కఠినమైన చలి వాతావరణంతోపాటు  శత్రువులను ఎదుర్కొనే భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ యూనిట్ ప్రపంచంలోనే ఏకైన సైనిక శక్తి అని ఆయన చెప్పారు. ట్యాంకులు, పదాతిదళ పోరాట వాహనాలు,  భారీ తుపాకుల నిర్వహణ ఈ భూభాగంలో ఒక సవాలు వంటిదని అన్నారు.


ఈ నేపథ్యంలో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు అధునాతన నిల్వలను పూర్తిగా సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు. అధిక క్యాలరీలతో కూడిన పోషకమైన రేషన్, ఇంధనం, చమురు, శీతాకాలపు దుస్తులు, వేడిని కలిగించే పరికరాలు తగినంతగా ఉన్నాయని మేజర్ జనరల్ అరవింద్ కపూర్ తెలిపారు.

పాంగాంగ్ సరస్సు సమీపంలో ఆగస్టు 29-30న చైనా దురాక్రమణ ప్రయత్నాన్ని అడ్డుకున్న భారత ఆర్మీ అక్కడి ఎత్తైన, వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నది. దీంతో నాటి నుంచి చైనా తన సైన్యం, ట్యాంకులు, ఆయుధాలను భారీగా మోహరిస్తున్నది. మరోవైపు శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు కఠినమైన చలిని తట్టుకుని మరో చైనా సైన్యాన్ని నిలువరించేందుకు భారత ఆర్మీ సన్నద్ధమైంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo