మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 14:53:56

చైనాకు చెక్‌.. ఇండియ‌న్ ఆర్మీ కొత్త ఎత్తుగ‌డ‌

చైనాకు చెక్‌.. ఇండియ‌న్ ఆర్మీ కొత్త ఎత్తుగ‌డ‌

న్యూఢిల్లీ:  ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న‌ట్లు చైనాకు వాళ్ల యుద్ధ‌రీతిలోనే ఇండియ‌న్ ఆర్మీ దీటుగా స‌మాధాన‌మిస్తోంది. ల‌ఢాక్‌లో పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) చొర‌బాట్ల‌కు చెక్ పెట్ట‌డానికి ట‌న్నెల్ డిఫెన్స్‌ల‌ను మోహ‌రించింది. 1962 త‌ర్వాత తొలిసారి ఈ ఏడాది ఆగ‌స్ట్ 29-30న స్పెష‌ల్ ఫ్రంటైర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్‌)తో క‌లిసి కైలాష్ రేంజ్‌లోని ద‌క్షిణ ఫాంగాంగ్ సో స‌ర‌స్సు ద‌గ్గ‌ర పాగా వేసింది ఇండియ‌న్ ఆర్మీ. ఈ ట‌న్నెస్ డిఫెన్స్‌ల‌ను జ‌పాన్‌తో యుద్ధం సంద‌ర్భంగా విజ‌య‌వంతంగా ఉప‌యోగించింది చైనా. అమెరికాతో యుద్ధంలో వియ‌త్నాం, కొరియా యుద్ధంలో నార్త్ కొరియా కూడా ఇదే వ్యూహాన్ని అనుస‌రించాయి. లాసాలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను ఉంచ‌డానికి ట‌న్నెల్ షెల్ట‌ర్ల‌ను, న్యూక్లియ‌ర్ బ్యాలెస్టిక్ మిస్సైల్ స‌బ్‌మ‌రైన్ల కోసం ద‌క్షిణ చైనా స‌ముద్రంలోని హైన‌న్ ఐలాండ్స్‌లో అండ‌ర్‌గ్రౌండ్ పెన్స్‌ను చైనా నిర్మించింది.

ఇప్పుడు ఇండియ‌న్ ఆర్మీ కూడా మ‌న బ‌లగాల కోసం ల‌ఢాక్‌లో ఇలాంటి ట‌న్నెల్స్‌నే ఏర్పాటు చేసింది. దీనికోసం భారీ కాంక్రీట్ పైపుల‌ను రంగంలోకి దించింది. ఈ కాంక్రీటు పైపులు ఆరు నుంచి 8 అడుగుల వ్యాసంతో ఉన్నాయి. దీంతో శ‌త్రువు కంట ప‌డ‌కుండా అండ‌ర్‌గ్రౌండ్‌లో మ‌న బ‌ల‌గాలు సులువుగా ఒక చోటు నుంచి మ‌రో చోటుకు వెళ్లే వీలుంటుంది. అంతేకాకుండా అక్క‌డి గ‌డ్డ‌క‌ట్టించే చ‌లి నుంచి మ‌న బ‌ల‌గాల‌ను ర‌క్షించేందుకు వీలుగా ఈ ట‌న్నెల్‌ల‌ను వేడి చేసే వీలు కూడా ఉంటుంది. ల‌ఢాక్‌లోని వాస్త‌వాధీన రేఖ‌నే కాకుండా సెంట్ర‌ల్‌, సిక్కిం, ఈస్ట‌ర్న్ సెక్టార్ల‌లోనూ పీఎల్ఏ క‌ద‌లిక‌లపై ఓ క‌న్నేసి ఉంచింది. టిబెట్‌లో చైనీస్ ఆర్మీ మిలిట‌రీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను నిర్మిస్తుండటాన్ని ఇండియ‌న్ ఆర్మీ నిశితంగా ప‌రిశీలిస్తోంది.