ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 18:04:51

గూర్ఖా సైనికుల గిఫ్ట్‌లను భార్యలకు అందించిన ఆర్మీ చీఫ్‌ సతీమణి

గూర్ఖా సైనికుల గిఫ్ట్‌లను భార్యలకు అందించిన ఆర్మీ చీఫ్‌ సతీమణి

న్యూఢిల్లీ: భారత సైన్యంలోని గూర్ఖా జవాన్ల బహుమతులను వారి భార్యలకు ఆర్మీ చీఫ్‌ జనరల్ మనోజ్ ముకుంద్ నారవణే సతీమణి వీణ నారవణే అందజేశారు. ఆర్మీ చీఫ్‌ నేపాల్‌ పర్యటన సందర్భంగా భార్య కూడా ఆయన వెంట వెళ్లారు. భారత ఆర్మీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న గూర్ఖా జవాన్ల భార్యలను ఖాట్మండులో ఈ నెల 6న ఆమె కలిశారు. సైనికుల భార్యల సంక్షేమ సంఘానికి అధ్యక్షురాలైన వీణ నారవణే, వారి భర్తలు పంపిన కానులను ఆ భార్యలకు అందజేశారు.

నేపాల్‌కు చెందిన గూర్ఖా జవాన్లు భారత్‌ ఆర్మీకి ఎనలేని సేవలందిస్తున్నారు. సెలవుల్లో తమ దేశానికి వెళ్లి కుటుంబంతో హాయిగా గడుపుతారు. దసరా పండుగ సందర్భంగా గూర్ఖా జవాన్లకు సెలవులు లభించినప్పటికీ కరోనా వల్ల నేపాల్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి తమ భర్తలు బహుమతులను పంపడంపట్ల వారి భార్యలు ఎంతో సంతోషించారు.

కాగా ఈ నెల 4 నుంచి 6 వరకు మూడు రోజుల నేపాల్‌ పర్యటన సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నారవణేను ఆ దేశ ఆర్మీ చీఫ్‌ హోదాతో సత్కరించారు. భారత్‌, నేపాల్‌ ఆర్మీ చీఫ్స్‌ను పరస్పరం గౌరవించుకునే ఆనవాయితీ గత కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.