బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 19:57:30

కాల్పుల కేసు.. అంతర్జాతీయ కోర్టులో గెలిచిన భారత్‌

కాల్పుల కేసు.. అంతర్జాతీయ కోర్టులో గెలిచిన భారత్‌

న్యూఢిల్లీ: ఇటలీ నౌకా సిబ్బంది కాల్పుల కేసుపై అంతర్జాతీయ కోర్టులో భారత్‌ విజయం సాధించింది. కేరళ మత్స్యకారులపై కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారణమైన ఇటలీ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌకకు చెందిన ఇద్దరు నిందితుల నుంచి పరిహారం రాబట్టవచ్చని గురువారం తీర్పు ఇచ్చింది. హేగ్‌లోని మధ్యవర్తిత్వ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం తెలిపారు. 

2012 ఫిబ్రవరి 15న కేరళ తీరానికి సమీపంలో ఉన్న ఇటలీ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ‘ఎన్రికా లెక్సీ’కి చెందిన సిబ్బంది సాల్వటోర్ గిరోన్, మాసిమిలియానో లాటోరే భారత మత్స్యకారుల పడవపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులు చనిపోయారు. దీంతో ఇటలీ నౌకకు చెందిన ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేయడంతో ఇటలీకి వెళ్లిపోయారు. 

మరోవైపు ఈ కేసు విచారణ పరిధి గురించి భారత్‌, ఇటలీ మధ్య వివాదం తలెత్తింది.  ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు చనిపోయారని, ఈ నేపథ్యంలో భారత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగాలని భారత్‌ స్పష్టం చేసింది. కాగా, తమ నౌక అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్నదని, భారత మత్స్యకారులను సముద్ర దొంగలుగా పొరబడి ప్రాణ రక్షణ కోసం తమ సిబ్బంది కాల్పులు జరిపినట్లు ఇటలీ పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ సిబ్బందిని బంధించినందుకు, తమ నౌకను నిర్బంధించి నష్టం కలిగించినందుకు పరిహారం చెల్లించాలని వాదించింది.  

అయితే పరిహారం విషయంలో ఇరు దేశాల మధ్య అవగాహనకు యూఎన్‌ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టంలోని నిబంధనల ప్రకారం 2015 జూన్‌ 15న మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఇరువైపు వాదనలు విన్న మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన ఇటలీ నౌకకు చెందిన ఇద్దరు నిందితులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంతోపాటు భారతదేశ నావిగేషన్ స్వేచ్ఛను కూడా ఉల్లంఘించారని పేర్కొంది. దీంతో ఇటలీ నుంచి పరిహారం పొందే హక్కు భారత్‌కు ఉన్నదని స్పష్టం చేసింది.



logo