మంగళవారం 14 జూలై 2020
National - Jun 20, 2020 , 01:59:01

రేపు సూర్యగ్రహణం

రేపు సూర్యగ్రహణం

  • జ్వాలావలయ రూపంలో కనువిందు
  • భారత్‌లో ఉదయం 9.56 నుంచి మధ్యాహ్నం 2.29 గంటల వరకు.. 

హైదరాబాద్‌, జూన్‌ 18: ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ (రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌) సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపించనున్నదని, తక్కిన భారతదేశంలో పాక్షికంగానే దర్శనమివ్వనుందని ప్లానెటరీ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉదయం 9.16 గంటల నుంచి సూర్యగ్రహణం మొదలవుతుందని పేర్కొంది. మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఇది బాగా కనిపిస్తుందని తెలిపింది. భారత్‌లో ఉదయం 9.56 గంటలకు మొదలై మధ్యాహ్నం 2.29 గంటలకు ముగుస్తుందని వెల్లడించింది. పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు మినహా తక్కిన ఆఫ్రికా, ఆగ్నేయ యూరప్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర తూర్పు రష్యా మినహా ఆసియా, ఇండొనేషియా తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుందని వివరించింది. కాంగోలో మొదలై.. భారత్‌లో సూరత్‌గఢ్‌(రాజస్థాన్‌), సిర్సా, కురుక్షేత్ర(హర్యానా), డెహ్రాడూన్‌, చమోలీ, జోషిమఠ్‌ (ఉత్తరాఖండ్‌) గుండా సాగనుంది. అనంతరం చైనా, తైవాన్‌ గుండా సాగి పసిఫిక్‌ మహాసముద్రం వద్ద ముగియనుంది.

మనకు కనిపించేది పాక్షిక సూర్యగ్రహణమే

ఈ నెల 21న (ఆదివారం) ప్రత్యేకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కాకుండా 99శాతం ఉపరితలాన్ని మాత్రమే కప్పేయడంతో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఏర్పడనుంది. మన హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. 

-బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్థ్‌ 

హైదరాబాద్‌లో గ్రహణం సమయం 

ప్రారంభం: ఉదయం 10.14 గంటలకు 

గరిష్ఠ గ్రహణం: ఉదయం 11.55 గంటలకు 

ముగింపు: మధ్యాహ్నం 1.44 గంటలకు


logo