ఆదివారం 07 మార్చి 2021
National - Jan 24, 2021 , 07:55:02

గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్‌ క్షిపణుల ప్రదర్శన

గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్‌ క్షిపణుల ప్రదర్శన

న్యూఢిల్లీ : ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగే పరేడ్‌లో భారత్‌ తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను ప్రదర్శించనుంది. కొత్తగా బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిసైల్‌, టీ-90 యుద్ధ ట్యాంకులను ప్రదర్శించేందుకు సైన్యం ఏర్పాటు చేసింది. తొలిసారిగా బంగ్లాదేశ్ సాయుధ దళాలు, బ్యాండ్‌ బృందం కవాతులో పాల్గొననుంది. భారత్‌తో బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్‌ బలగాలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. భారతదేశ సైనిక శక్తి, సాయుధ దళాల్లోని అత్యాధునిక ఆయుధాలైన మూడు టీ-90 ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, బీఎంపీ-2, రెండు పినాకా మల్టి రాకెట్‌ లాంచ్‌ సిస్టమ్‌, రెండు బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంక్‌, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు సంవిజయ్, అప్ గ్రేడెడ్ షిల్కా ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థలను కరోనా భద్రతా మార్గదర్శకాలను అనుసరించి జరిగే రాజ్‌పథ్‌లో జరిగే కవాతులో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది కొత్తగా ఏవీ ఆయుధాలు ప్రదర్శించడం లేదని, కీలకమైన ఆస్తులను, అప్‌గ్రేడ్‌ వెర్షన్లు ప్రదర్శించనున్నట్లు ఢిల్లీ ఏరియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, మేజర్‌ జనరల్‌ అలోక్‌ కాకర్‌ తెలిపారు.

సాయుధ, పారా మిలటరీ, ఢిల్లీ పోలీసులు, నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌, నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ బృందాలు కవాతులో పాల్గొంటాయని పేర్కొన్నారు. మౌంటెడ్ కాలమ్‌లో భాగంగా 43 గుర్రాలతో కూడిన 61 కావలరీ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. కరోనా భద్రతా నియమాల కారణంగా ఈ సారి మోటార్‌ సైకిల్‌ ప్రదర్శన ఉండదని పేర్కొన్నారు. కరోనా భద్రతా నిబంధలన కారణంగా ఎర్రకోటకు వెళ్లే దారిలో రెగ్యులర్‌ మార్గాన్ని అనుసరించే బదులు ఏడాది కవాతులో పాల్గొనే బృందాలు నేషనల్‌ స్టేడియంలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. అలాగే ఎయిర్‌ఫోర్స్‌లోకి కొత్తగా ప్రవేశపెట్టిన రాఫెల్‌ యుద్ధ విమానం సైతం రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ప్రదర్శనల్లో పాల్గొంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను 25వేలకు కుదించారు.  

VIDEOS

logo