మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 10:03:22

దేశంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నిలువరించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. సరిగ్గా ఇదే రోజు దేశంలో కరోనా కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. ఈ వైరస్‌ వల్ల కొత్తగా 434 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 17834కు పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకోగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.  

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో పెద్దఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో దేశంలో కరోనా కేసులు ఆరు లక్షలు దాటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యా కంటే భారత్‌ కేవలం 50 వేల కేసుల దూరంలో నిలిచింది. 26 లక్షల కేసులతో అమెరికా, 14 లక్షల కేసులతో బ్రెజిల్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.   

దేశంలో జూలై 1వ తేదీ వరకు 90,56,173 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 2,29,588 పరీక్షలు చేశామని వెల్లడించింది. 


logo