బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 12:53:38

పాక్‌ రాయబారికి భారత్‌ సమన్లు!

పాక్‌ రాయబారికి భారత్‌ సమన్లు!

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం సాధారణ పౌరులపై కాల్పుకులకు పాల్పడుతూ, ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకోవడంపై భారత ప్రభుత్వం త్రీవ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌ హైకమిషనర్‌కు విదేశాంగ శాఖ శనివారం సమన్లు జారీచేసింది. ఈ నెల 17న జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా ముగ్గురు పౌరులు మరణించారు. 

పాకిస్థాన్‌ హైకమిషన్‌లోని తాత్కాలిక రాయబారికి సమన్లు జారీచేశామని, అమాయక పౌరుల మృతి విషయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పాక్‌ సైన్యం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించింది. నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడాలని పాకిస్థాన్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని సూచించింది. 

ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దుల్లో 2711 సార్లు కాల్పులకు తెగబడింది. ఇందులో 21 మంది భారతీయులు మృతిచెందగా, 94 మంది గాయపడ్డారు.


logo