బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 03:23:49

కాస్త ఉపశమనం

కాస్త ఉపశమనం

-దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటులో స్వల్ప తగ్గుదల 

-సమూహవ్యాప్తి దశకు కొవిడ్‌-19 ఇంకా చేరుకోలేదు 

-ఇప్పటికీ రెండో దశలోనే కరోనా మహమ్మారి వ్యాప్తి

-కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

-అయినా అలసత్వం వహించబోమని వ్యాఖ్య 

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా విజృంభణ కలవరపెడుతున్నవేళ దేశ ప్రజానీకానికి కాస్త ఉపశమనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా రెండో దశలోనే ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టంచేశారు. సమూహ వ్యాప్తి (స్టేజ్‌-3) దశకు చేరినట్టు బలమైన ఆధారాలేవీ లభించలేదని తెలిపారు. దేశంలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నా.. పెరుగుదల రేటు స్థిరంగానే ఉన్నదని చెప్పారు. అదేసమయంలో కేసుల పెరుగుదల రేటులో కొంత తగ్గుదల కనిపిస్తున్నదని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వైరస్‌ వల్ల తాజాగా మరో ఏడుగురు మరణించారని, దీంతో మృతుల సంఖ్య 16కు పెరిగిందని తెలిపారు. దేశంలో కొత్తగా 90 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 694కి పెరిగిందని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఇందులో ఇప్పటికే 44 మందిని డిశ్చార్జి చేశామని చెప్పారు. ఈ మహమ్మారిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాయన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సూచించారు.  కొన్ని దేశాల్లో మాదిరిగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగకుండా.. మన దగ్గర బాధితుల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని వెల్లడిం చారు. అయితే ప్రస్తుత గణాంకాలు కొవిడ్‌-19 వ్యాప్తిపై స్పష్టత ఇవ్వవని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఈ లెక్కలను చూసి అలసత్వానికి తావిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య సమన్వయం సరిగ్గా       లేనప్పుడే వైరస్‌ సమూహవ్యాప్తి దశకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. సామాజిక దూరం, స్వీయ నిర్బంధానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు.  బాధితులతో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడం, వారిని గృహ నిర్బంధంలో ఉంచడం, లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. దేశవ్యాప్తంగా 64,411 మందిపై నిఘా పెట్టామన్నాని ఆయన వెల్లడించారు. ఇందులో 8,300 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని, మిగతావారు గృహ నిర్బంధంలో ఉన్నారన్నారు.  

లాక్‌డౌన్‌ అమలుకోసం డ్రోన్ల వినియోగం 

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిని గుర్తించడానికి పలు రాష్ర్టాలలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ రెండోరోజైన గురువారం రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుష్యంగా కనిపించాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కూరగాయలను పంపిణీ చేయడానికి దాదాపు 200 మందిని పోగేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులో దాదాపు 1200  కేసులు నమోదయ్యాయి. యూపీలో 8,649 మందిపై పోలీ సులు 2,802 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బీహార్‌లో పోలీసులు దాదాపు రూ. 24 లక్షలు జరిమానా వసూలు చేశారు.

ప్రత్యేక దవాఖానల ఏర్పాటు 

కరోనా బాధితుల కోసం ప్రత్యేక దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 17 రాష్ర్టాలు ఈ మేరకు చర్యలు చేపట్టాయన్నారు. వైద్యసిబ్బందిని పెంచేందుకు కృషిచేస్తున్నామని, ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో ఒక బృందానికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. దోమల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో స్టేజ్‌-3 అనుమానిత కేసులు నమోదవడంపై ఐసీఎంఆర్‌ అధికారి రామన్‌ ఆర్‌ గంగకేదార్‌ స్పందిస్తూ.. ‘ఒకటి రెండు కేసులు నమోదైనంత మాత్రాన సమూహ వ్యాప్తి దశకు చేరిందని చెప్పలేము. దానికి ఇంకా బలమైన ఆధారాలు దొరుకలేదు’ అని పేర్కొన్నారు. 

కరోనా భయంతో తమ్ముడిని చంపిన అన్న

ముంబై: ముంబై శివారు కాందవల్లి లో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించని తమ్ముడిని అన్న గురువారం హతమార్చాడు. పుణెలో ఓ ప్రైవేట్‌ సంస్థ ఉద్యో గి దుర్గేశ్‌ కరోనా నేపథ్యంలో ఇటీవలే ఇంటికొచ్చాడు. తరచూ బయటకెళ్లి వ స్తున్న దుర్గేశ్‌ను.. అన్న రాజేశ్‌ హెచ్చరించాడు. బుధవారం రాత్రీ బయటకెళ్లి వచ్చిన దుర్గేశ్‌పై రాజేశ్‌, అతడి భార్య ఆగ్రహం వ్యక్తంచేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంలో రాజే శ్‌ పదునైన ఆయుధంతో దుర్గేశ్‌పై దాడిచేశారు. తర్వాత దవాఖానకు తరలించగా మార్గమధ్యంలోనే మరణిం చాడని వైద్యులు చెప్పారు. 


logo
>>>>>>