మంగళవారం 19 జనవరి 2021
National - May 06, 2020 , 01:32:55

24 గంటల్లో 3,900 కేసులు

24 గంటల్లో 3,900 కేసులు

  • 195 మరణాలు..
  • 50వేలకు చేరువలో బాధితులు

న్యూఢిల్లీ, మే 5: దేశంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం నుంచి మంగళవారం నాటికి గడిచిన 24 గంటల్లో 3,900 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో మరణాలు కూడా రికార్డు స్థాయిలో 195 సంభవించాయి. దేశంలో కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజులోనే ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు నమోదుకావడం, మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరుకుంది. మొత్తం మరణాలు 1,568కి పెరిగాయి. అలాగే కరోనా బారిన పడి ఇప్పటి వరకు 13,160 మంది కోలుకున్నారు. ఇక కేసుల పరంగా, మరణాల పరంగా చూస్తే మహారాష్ట్ర తొలిస్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,541 కరోనా కేసులు నమోదవ్వగా.. 583 మంది మరణించారు. వైరస్‌ బారిన పడిన వాళ్లలో ఇప్పటి వరకు 28.17 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. తాజాగా సంభవించిన 195 మరణాల్లో 98 మరణాలు పశ్చిమబెంగాల్‌లో, మహారాష్ట్రలో 35, గుజరాత్‌లో 29 సంభవించాయని వివరించారు. 

వైరస్‌ సమూహ వ్యాప్తి దశలో లేదు: హర్షవర్ధన్‌

దేశంలో కరోనా సమూహ వ్యాప్తి దశలో లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. కరోనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమని పరోక్షంగా ప్రస్తావించారు. కాగా, దేశీయ సంస్థలు రోజుకు సగటున 2.5 లక్షల పీపీఈలు, 2 లక్షల ఎన్‌-95 మాస్కులను తయారుచేస్తున్నాయని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) అధికారులు తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా మంత్రులకు అధికారులు వివరించారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని, ర్యాండమ్‌గా తనిఖీలు జరుపాలని జీవోఎం స్పష్టం చేసింది. 

40రోజులైనా ఆగదేమి?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో భిన్న వైఖరి

భారత్‌లో కరోనా కేసుల పరిస్థితి విచిత్రంగా ఉన్నది. 40 రోజుల లాక్‌డౌన్‌ పూర్తి అయిన చైనా, ఫ్రాన్స్‌, ఇటలీలాంటి దేశాలతో పోల్చితే మన దగ్గర నమోదయ్యే సగటు కేసులు పెరుగుతున్నాయి. రెండో విడుత లాక్‌డౌన్‌ చివరి వారంలో రోజుకు సగటున 2,022 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో ఫ్రాన్స్‌లో 1,882, చైనాలో 413గా ఉన్నాయి. దేశంలో ఏప్రిల్‌ 30 వరకు 33,610 ఉన్న కేసులు 4వతేదీ నాటికి 42,553కు పెరిగాయి. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 8,943 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఫ్రాన్స్‌, ఇటలీ, చైనాలాంటి దేశాల్లో లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసుల పెరుగుదలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. కానీ భారత్‌లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మరోవైపు సడలింపుల నేపథ్యంలో మద్యం కోసం జనాలు ఎగబడటం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెప్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.