గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 21:00:50

సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్ ఏర్పాటు

సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్ ఏర్పాటు

పెల్లింగ్: భూమి పైన వందల అడుగుల తాత్కాలికంగా నిర్మించిన పారదర్శక వంతెనపై ఎప్పుడైనా నడిచారా? అలాంటి గాజు వంతెనలపై నడుస్తున్న ప్రజల వీడియోను చూశారా? నిజంగా చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది గాజు స్కైవాక్‌పై నడిస్తే.. ఆ అనుభూతే వేరు. అలాంటి అనుభూతిని పొందేందుకు సిక్కింలో తొలి గ్లాస్‌ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిక్కిం పెల్లింగ్‌లో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు సిక్కిం సాంస్కృతిక శాఖ, భవనాలు, గృహనిర్మాణ శాఖ పర్యవేక్షణలో నిధులు సమకూర్చారు. చెన్రెజిగ్ యొక్క 137 అడుగుల విగ్రహానికి కుడివైపున ఏర్పాటుచేశారు. అద్భుతమైన హిమాలయాల మధ్య నెలకొల్పిన గ్లాస్ స్కైవాక్ బౌద్ధ పుణ్యక్షేత్రం యొక్క అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. మొత్తం సముదాయం సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తులో ఉంది. 

గ్లాస్ స్కైవాక్ సుందరమైన బౌద్ద మత పుణ్యక్షేత్రం యొక్క ఆకర్షణను మరింత పెంచనున్నది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా వృద్ధిలోకి రావడం ఖాయమని స్థానికులు భావిస్తున్నారు. చెన్రెజిగ్ లేదా అవలోకితేశ్వర.. స్థానిక జానపద కథల ప్రకారం, బుద్ధుడు, అమితాభా యొక్క భూ అవతారం. పెల్లింగ్‌లోని చోలింగ్ ఏరియా వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని రూ.46.65 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2018 లో ప్రారంభించిన ఈ యాత్రాక్షేత్రం ప్రపంచంలోని ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహంతోపాటు గ్లాస్ స్కైవాక్, కేఫ్, గ్యాలరీని కలిగి ఉంది. పర్యాటకులు చెన్రెజిగ్ విగ్రహం, దానిపైకి వెళ్ళే మెట్లు, బంగారు ప్రార్థన చక్రాల యొక్క విస్తృత దృశ్యాన్ని అందించే ఉద్దేశంతో స్కైవాక్ నిర్మించారు. బీపీ ఎక్కువగా ఉన్నవారు, హార్ట్‌ రేట్‌ తక్కువగా ఉన్నవారు ఈ గ్లాస్ స్కైవాక్‌పై నడవటం శ్రేయస్కరం కాదని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.