గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 09:55:28

దేశంలో ఒకేరోజు 38,902 కరోనా కేసులు

దేశంలో ఒకేరోజు 38,902 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. వరుసగా గత నాలుగు రోజులుగా 32 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,77,618కు చేరింది. కరోనా వైరస్‌తో కొత్తగా 543 మంది మరణించడంతో మొత్తం మరణాలు 26,816కు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,73,379 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, మరో 6,77,423 మంది బాధితులు కోలుకున్నారు.  రికవరీ రేటు 62.93 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 

దేశంలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,00,937 కరోనా నమోదవగా, 11,596 మంది మరణించారు. రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 8,348 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ కాగా, 144 మంది చనిపోయారు. తమిళనాడులో నిన్న 4807 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,714కు చేరింది. కొత్తగా 88 మంది మరణించడంతో మొత్తం మృతులు 2403కు పెరిగారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 1,21,582 మంది కరోనాబారినపడ్డారు. కరోనా వైరస్‌తో 3597 మంది మరణించారు. ఇక కర్ణాటకలో నిన్న 4537 కరోనా కేసులు నమోదవగా, 93 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 59,652కు చేరగా, 1240 మంది మరణించారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 47,390 కేసులు నమోదవగా, 2122 మంది చనిపోయారు.  

దేశంలో నిన్న 3,58,127 నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. జూలై 18 వరకు దేశవ్యాప్తంగా 1,37,91,869 మంది కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.


logo