గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 13:02:00

వారం రోజుల్లో 24 వేల మందికి కరోనా పాజిటివ్‌

వారం రోజుల్లో 24 వేల మందికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. ఎంతలా అంటే కేవలం వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 24,323 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం (మే 5న) ఉదయం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433గా ఉన్నది. సరిగా వారం గడిచేవరకు ఆ సంఖ్య 70,756కి పెరిగింది. అంటే ఏడు రోజుల వ్యవధిలోనే 24,323 కరోనా పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 

మే 5న దేశంలో 32,138 యాక్టివ్‌ కేసులు ఉండగా, 12,726 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల మొత్తం 1568 మంది మృతిచెందారు. కాగా, ఈ రోజు కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో యాక్టివ్‌ కేసులు సంఖ్య 46,008గా ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 22,454కు చేరింది. అంటే గతవారంతో పోల్చితే యాక్టివ్‌ కేసులు మరో 14 వేలు పెరగగా, కోలుకున్న బాధితుల సంఖ్య పది వేలు మాత్రమే పెరిగింది. అయితే నమోదైన కేసులు మాత్రం వీటికి రెట్టింప్పయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 2293 మంది మరణించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. 

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 23,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 868 మంది మరణించారు. గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 8,541కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 513 మంది బాధితులు మృతిచెందారు. ఇక తమిళనాడులో కరోనా కేసులు గత మూడు రోజులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 8002 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 7,233 కరోనా కేసులు ఉన్నాయి.


logo