శనివారం 16 జనవరి 2021
National - Dec 17, 2020 , 10:39:13

దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 24 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 26 వేలమంది కరోనా బారినపడగా, తాజాగా 24 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 9 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసులు కోటికి మరో 50 వేల దూరంలో నిలిచాయి. 

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. ఇందులో 3,22,366 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 94,89,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,44,451 మంది కరోనా వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనాబారిన పడినవారిలో 355 మంది మరణించగా, కొత్తగా 33,291 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. 

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,86,807 మంది కరోనాబారినపడ్డారు. ఇందులో 48,434 మంది మరణించారు. కర్ణాటకలో 9,04,665 పాజిటివ్‌ కేసులు రికార్డవగా, ఆంధ్రప్రదేశ్‌లో 8,76,814 మంది, తమిళనాడులో 8,02,342 మంది, కేరళలో 6,83,440 మంది, ఢిల్లీలో 6,11,994 మంది కరోనాబారిన పడ్డారు.