సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 01:13:36

భారత్‌ @3 కరోనా కేసుల నమోదులో రష్యాను దాటిన భారత్‌?

భారత్‌ @3 కరోనా కేసుల నమోదులో రష్యాను దాటిన భారత్‌?

  • 24 గంటల్లోనే అత్యధికంగా 24,850 మందికి పాజిటివ్‌
  • దేశంలో 6,83,240కు చేరిన వైరస్‌ కేసులు.. 19,268 మరణాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ ఉద్ధృతమవుతున్నది. శరవేగంగా పెరుగుతున్న కేసులతో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నది. వైరస్‌ కేసుల జాబితాలో ఇప్పటివరకూ మూడో స్థానంలో ఉన్న రష్యాను తోసిరాజని భారత్‌ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆదివారం రాత్రినాటికి రష్యాలో 6,81,251 కేసులు (మరణాలు-10,161) నమోదుకాగా, భారత్‌లో కేసుల సంఖ్య 6,83,240గా ఉన్నది. ఇక అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 29,59,118 కేసులు (మరణాలు-1,32,418), రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 15,79,876 కేసులు (మరణాలు-64,383) నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1,14,74,447 మందికి వైరస్‌ సోకగా, 5,35,098 మంది మరణించారు.  

మూడోరోజు కూడా..

దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా శనివారం నుంచి ఆదివారం వరకూ 24,850 మందికి వైరస్‌ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌బారిన పడినవారి సంఖ్య 6,83,240కు చేరింది. ఇరవై వేలకు పైగా కేసులు నమోదుకావడం వరుసగా ఇది మూడోరోజు. వైరస్‌ కారణంగా గత 24 గంటల్లో 613 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 19,268కు చేరింది. ఇప్పటివరకూ 4,09,082 మంది రోగులు కోలుకోగా, 2,44,814 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న రోగులు 60.77 శాతంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జూలై 4 వరకు 97,89,066 నమూనాలను, శనివారం 2,48,934 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 2,00,064 కేసులు, 7,074 మరణాలు నమోదుకాగా, తమిళనాడులో 1,07,001 కేసులు, 4,280 మరణాలు రికార్డయ్యాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఆదివారంనాటికి హస్తినలో 97,200 కేసులు, 2,505 మరణాలు నమోదయ్యాయి. logo