ఆదివారం 24 జనవరి 2021
National - Nov 30, 2020 , 15:44:39

సామాన్యుడికి క‌రోనా వ్యాక్సిన్ అందేది ఎప్పుడు?

సామాన్యుడికి క‌రోనా వ్యాక్సిన్ అందేది ఎప్పుడు?

న్యూఢిల్లీ: క‌రోనా ఏడాది కాలంగా వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఇండియాతోపాటు ర‌ష్యా, చైనా, అమెరికా, బ్రిట‌న్‌లాంటి దేశాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి అడ్వాన్స్‌డ్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. అమెరికాలో అయితే ఫైజ‌ర్ వ్యాక్సిన్ క్రిస్మ‌స్ లోపే అందుబాటులోకి వ‌స్తుంద‌న్న వార్త‌లూ వస్తున్నాయి. ఇండియాలోనూ మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో వ్యాక్సిన్ ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌రుచూ చెబుతోంది. ఇప్ప‌టికే చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం భారీగా ఆర్డ‌ర్లు ఇస్తున్నాయి. అయితే ఈ ట్ర‌య‌ల్స్‌, భారీ సంఖ్య‌లో ఆర్డ‌ర్స్‌ను చూసి మ‌న‌కూ త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌నుకుంటే పొర‌పాటే. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి గ‌ట్టెక్కించే ఈ వ్యాక్సిన్ ఇండియాలోని ఓ సామాన్యుడికి చేర‌డానికి ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అదెలాగూ ఇప్పుడు చూద్దాం. 

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం ఆర్డ‌ర్లు చేస్తున్నాయ‌ని చెప్పుకున్నాం కదా. అలా మొత్తం ఐదు ప్ర‌ధాన వ్యాక్సిన్‌ల కోసం మొత్తం 280 కోట్ల డోసుల ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఇందులోని టాప్ మూడు కంపెనీల్లో అత్య‌ధికంగా ఆక్స్‌ఫర్డ్‌తో అనుసంధాన‌మైన ఆస్ట్రాజెనెకాకు 150 కోట్ల డోసుల ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఇండియా కూడా ఈ వ్యాక్సిన్ కోస‌మే ఆర్డ‌ర్ చేసింది. కొవీషీల్డ్ పేరుతో ఇది ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఈ మొత్తం డోసుల్లో అమెరికా, యురోపియ‌న్ యూనియ‌న్ చెరో 70 కోట్ల డోసుల‌తో టాప్ ప్లేస్‌లో ఉండ‌గా.. ఇండియా 50 కోట్లు, జ‌పాన్ 29 కోట్ల డోసులు ఆర్డ‌ర్ చేసింది. 

ఒక్కో వ్య‌క్తికి ఈ వ్యాక్సిన్ రెండు డోసులు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఆ లెక్క‌న దేశం, జ‌నాభా చూసుకుంటే అంద‌రికీ వ్యాక్సిన్ అంద‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో ఓ అంచ‌నాకు రావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు కెన‌డా 9.6 కోట్ల డోసులు ఆర్డ‌ర్ చేసింది. అంటే 125 శాతం ఆర్డ‌ర్ చేసి పెట్టుకుంది. జ‌పాన్ కూడా 29 కోట్లు అంటే.. 115 శాతం ఆర్డ‌ర్ చేసింది. యూకే, యూఎస్ త‌మ జ‌నాభాకు స‌రిప‌డా ఆర్డ‌ర్లు చేశాయి. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే 50 కోట్ల డోసులు అంటే.. ఇవి కేవ‌లం 25 కోట్ల మందికే స‌రిపోతాయి. 138 కోట్ల జ‌నాభా ఉన్న ఇండియాలో ఈ డోసుల సంఖ్య కేవ‌లం 20 శాతం మాత్ర‌మే. అందులోనూ క‌రోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు, క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉన్న‌వాళ్ల‌కు మొద‌ట వ్యాక్సిన్ అందిస్తారు. అంటే ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు అందించే ప్రొఫెష‌న‌ల్స్‌, క‌రోనా ప్ర‌మాదం ఎక్కువగా ఉన్న వాళ్ల‌కు మొద‌ట వ్యాక్సిన్ ఇస్తారు. ఈ మొద‌టి 25 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయ‌డానికే వ‌చ్చే ఏడాది జులై వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ లెక్క‌న దేశంలోని మొత్తం జ‌నాభాకు వ్యాక్సిన్ అందాలంటే క‌నీసం మ‌రో ఏడాదైనా ప‌ట్టొచ్చ‌న్న‌ది నిపుణులు చెబుతున్న మాట‌. 


logo