బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 11:38:31

శక్తి, విస్తీర్ణంలో భారత్‌ చైనా మించాలి : మోహన్‌ భగవత్‌

శక్తి, విస్తీర్ణంలో భారత్‌ చైనా మించాలి : మోహన్‌ భగవత్‌

నాగ్‌పూర్‌ : శక్తి, విస్తీర్ణం పరంగా భారత్‌.. చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వార్షిక విజయదశమి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈ సారి 50 మంది వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా భారతదేశం మెరుగ్గా సిద్ధం కావాలన్నారు.

ఇప్పుడు చాలా దేశాలు చైనాకు అండగా నిలుస్తున్నాయన్నారు. దేశం తన చొరబాటుకు ప్రతి స్పందించడం చూసి చైనా షాక్‌ అయ్యిందని చెప్పారు. మహమ్మారి మధ్య చైనా మన సరిహద్దుపై దండెత్తిందని, ఆ దేశ విస్తరవాద స్వభావం ప్రపంచానికి తెలుసునన్నారు. దీనికి తైవాన్‌, వియత్నాం ఉదాహరణలుగా పేర్కొన్నారు. ‘మనం అందరితో స్నేహం చేయాలని కోరుకుంటాం. అది మన నైజం. అయినప్పటికీ బలహీనతల పట్ల మన కరుణను తప్పుగా అంచనా వేసి, క్రూరశక్తి ద్వారా విచ్ఛిన్న౦ చేయడానికి ప్రయత్ని౦చడ౦ అ౦గీకారయోగ్య౦ కాదు.

ఈ విషయం మన ప్రత్యర్థులకు ఇప్పుడే తెలియజేయాలి’ అన్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) ఏ ప్రత్యేక మత సమాజానికి వ్యతిరేకం కాదని మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. వారి జనాభాను పరిమితం చేసే లక్ష్యంతో ‘కొందరు మన ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారు’ అన్నారు. కరోనా వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, కానీ మరణాలు తక్కువగా ఉన్నాయన్నారు. అంటువ్యాధి కారణంగా పరిశుభ్రత, పర్యావరణం ప్రాముఖ్యతను తిరిగి నేర్చుకోవడం ప్రారంభించామన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.