బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 01:48:43

ఆయుధల కొనుగోళ్లలో 2వ ర్యాంక్‌

ఆయుధల కొనుగోళ్లలో 2వ ర్యాంక్‌
  • సౌదీ అరేబియా తర్వాత మనమే
  • రష్యా, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ నుంచి అత్యధిక కొనుగోళ్లు
  • సిప్రి తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నది. భారత ఆయుధ మార్కెట్‌లో రష్యా వాటా 72 శాతం నుంచి 56 శాతానికి తగ్గినప్పటికీ, ఇప్పటికీ రష్యానే భారత్‌కు అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఉన్నది. 2015-19 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ క్రయవిక్రయాలకు సంబంధించి ‘అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి)’ తాజాగా వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

  • ఆయుధాల దిగుమతిలో  సౌదీ అరేబియా, భారత్‌, ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా, చైనా వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 
  • ఇతర దేశాల నుంచి కూడా భారత్‌ మిలిటరీ హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకున్నది. డెన్మార్క్‌ నుంచి స్కాంటర్‌-6000 రాడార్లు, బ్రెజిల్‌ నుంచి ఎంబ్రేర్‌ ఈఆర్‌జే-145 జెట్‌లు, జర్మనీ నుంచి అక్టాస్‌ సోనార్‌ సిస్టమ్స్‌, ఇటలీ నుంచి సూపర్‌ ర్యాపిడ్‌ 76ఎంఎం నావల్‌ గన్స్‌, దక్షిణ కొరియా నుంచి కే-9 థండర్‌ 155ఎంఎం ఆర్టిలరీ గన్స్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు, పొరుగుదేశం పాకిస్థాన్‌ ఆయుధ కొనుగోళ్లలో 11వ స్థానంలో ఉన్నది. గతేడాది పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాక్‌ మధ్య జరిగిన గగనతల ఘర్షణల్లో ఇరుదేశాలూ దిగుమతి చేసుకున్న ఆయుధాలనే వాడాయి. 


2010-14 మధ్య అమెరికా నుంచి భారత్‌కు రక్షణ ఎగుమతులు పెరిగాయి. అయితే 2015-19 మధ్య 51 శాతం తగ్గాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ నుంచి దిగుమతులు వరుసగా 175%,715% పెరుగడం విశేషం. 

2015-19 మధ్యకాలంలో రష్యా తర్వాత ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ల నుంచే భారత్‌ అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసింది.


23 ప్రపంచంలో ఆయుధ ఎగుమతి దేశాల్లో భారత్‌ స్థానం. ఎక్కువగా  మయన్మార్‌, శ్రీలంక, మారిషస్‌కు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం.


logo
>>>>>>