ఒక రోజు అన్నం పెడితే ఆ పూట మాత్రమే ఆకలి తీరుతుంది. అదే ఏదైనా విద్యను అందిస్తే జీవితాంతం బతుకు దెరువుకు ఢోకా ఉండదు. గౌరవప్రదంగా తమ కాళ్ల మీద తాము నిలబడవచ్చు. కుటుంబానికి ఆధారభూతం కావొచ్చు. ఈ లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో యువత విద్య, సాధికారత, స్వాలంబనకు కోసం అభయ ఫౌండేషన్ కృషి చేస్తోంది.
మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి ఫౌండేషన్ అందిస్తున్న చేయూత యువతకు వరంగా మారింది. కారు డ్రైవింగ్, కుట్టు మిషన్ శిక్షణతో ఉపాధి పొందుతూ ఆనందంగా జీవితంలో అడుగులు వేసే స్థాయికి చేరుకున్నారు.
మారుమూలన ఉన్న మా గ్రామం గురించి ఎవరూ పట్టించుకోలేదు. శిక్షణ కోసం మా గ్రామానికి రాగానే పరిస్థితిని చెప్పాం. ఇక్కడే శిక్షణనివ్వాలని, మా గ్రామస్తులకు మేలు చేయాలని కోరగా ఒప్పుకున్నారు. ఇప్పటికే కొంత మంది శిక్షణ పూర్తి చేసుకోగా, మరికొంత మంది శిక్షణ పొందుతున్నారు.- లక్ష్మీసంజీవ, సర్పంచ్,
డబిల్పూర్ గ్రామంలో ఉన్న కంపెనీలో పని చేస్తూ కుట్టు మిషన్ శిక్షణ పొందాను. మూడు నెలల శిక్షణలో పెట్టికోట్లు, ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్ తదితర 40 రకాల డిజైన్లు నేర్పించారు. జాబ్ చేస్తూ ఆదివారం, సెలవు దినాల్లో కుట్టు పనితో 3, 4వేల వరకు అదనంగా సంపాదిస్తున్నాను. పెండ్లి అయిన తర్వాత షాప్ పెట్టుకొని, ఫుల్‌టైం ఇదే పని చేస్తాను. – జ్యోతి, లింగాపూర్
పలు జిల్లాలు, రాష్ర్టాల్లో యువత సాధికారిత కోసం ఇబ్రహీంపట్నం కేంద్రంగా పని చేస్తున్న అభయ ఫౌండేషన్ మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో శిక్షణా కార్యక్రమ నిర్వహణకు పర్యటించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లక్ష్మీసంజీవ మండల కేంద్రానికి దూరంగా ఉన్న తమ గ్రామంలో ఉపాధి శిక్షణ ఎంతో అవసరమని, తాము అన్ని విధాలుగా సహకరిస్తామని పట్టుబట్టారు. ఇందుకు ముగ్ధులైన అభయ ఫౌండేషన్ నిర్వాహకులు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. గత ఏడాది మార్చిలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కరోనా రావడంతో కొన్ని రోజులకే శిక్షణా తరగతులు నిలుపుదల చేశారు. తిరిగి ఇటీవల శిక్షణా తరగతులను ప్రారంభించి, పూర్తి చేశారు. మొదటి దశలో 12 మంది కారు డ్రైవింగ్‌లో, 12 మంది యువతులు, మహిళలు కుట్టుమిషన్‌లో శిక్షణ పొందారు. విజయవంతంగా డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్స్‌లు, మహిళలకు కుట్టు మిషన్లను కూడా ధనుష్ హెల్త్ కేర్ సంస్థతో కలిసి అందజేశారు. రెండో విడుతలో 35 మంది మహిళలు శిక్షణ పొందడానికి సన్నద్ధమయ్యారు. తరగతులు ప్రారంభమయ్యాయి. కారు డ్రైవింగ్ శిక్షణకు 14 మంది యువకులు సిద్ధం కాగా, త్వరలో ఆ శిక్షణా కూడా ప్రారంభకానుందని నిర్వాహకులు తెలిపారు.
గ్రామాల్లో యువత ముందుకు వస్తే కారు డ్రైవింగ్, కుట్టు మిషన్, హౌస్ వైరింగ్‌లో శిక్షణనిస్తాం. ఒకే గ్రామంలో 30 నుంచి 40 మంది ఉంటే శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తాం. గ్రామాలు స్వాలంబన సాధించడమే తమ లక్ష్యం. జిల్లానే కాదు పలు రాష్ర్టాల్లో వేలాది మంది యువతీ, యువకులు, మహిళలకు శిక్షణనిచ్చాం. – బాలచంద్ర, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
గతంలో కంపెనీలో పని చేసే వాడిని, జీతం సరిపోకపోయేది. దీంతో నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు. లైసెన్స్ వచ్చి 8 రోజులైంది. టెంపరరీగా మూడు, నాలుగు ట్రిప్పులు చేశాను. ఫ్యూచర్లో డ్రైవింగ్ ఫీల్డ్నే ఎంచుకుంటా. ఇందులోనే బాగా సంపాదించుకుని మంచిగా బతికే అవకాశం ఉంది.- పెగుడ హరి, లింగాపూర్