శనివారం 11 జూలై 2020
National - May 26, 2020 , 02:28:15

ప్రపంచ హాట్‌స్పాట్‌గా మారుతున్న నగరం

ప్రపంచ హాట్‌స్పాట్‌గా మారుతున్న నగరం

  • కరోనా అడ్డా ముంబై
  • 30వేలు దాటిన వైరస్‌ కేసులు.. 988 మంది మృతి
  • వారం రోజుల్లోనే కేసుల్లో 98.41 శాతం పెరుగుదల
  • మాస్కోని వెనక్కినెట్టే దిశగా అడుగులు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారికి అడ్డాగా మారింది. ప్రపంచ హాట్‌స్పాట్‌ నగరంగా అవతరిస్తున్నది. నగరంలో గత కొంతకాలంగా కేసుల నమోదులో అనూహ్య పెరుగుదల కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్న నగరాల్లో ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కో తొలిస్థానంలో ఉన్నది. అయితే, మాస్కోను వెనక్కినెట్టేలా ఇటీవల ముంబైలో వైరస్‌ కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల నమోదవుతున్నది.  ముంబై మొత్తం జనాభా దాదాపు 1.8 కోట్లు. ఇందులో 0.22 శాతం మందికి ఇప్పటికే వైరస్‌ సోకింది. మే మొదటి వారం నుంచి ఇప్పటివరకూ కేసుల సంఖ్యలో మూడు రెట్లు పెరుగుదల నమోదైంది. మే 22న ముంబైలో 1,751 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో  ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన నగరాల్లో మాస్కో తర్వాత ముంబై నిలిచింది. ఏడు రోజుల సగటు కేసులను పరిగణలోకి తీసుకుంటే అత్యధిక కేసులు నమోదవుతున్న బ్రెజిల్‌లోని సావో పాలో నగరాన్ని ముంబై ఇప్పటికే దాటివేసింది.

దేశవ్యాప్తంగా 1,38,845 వైరస్‌ కేసులు నమోదుకాగా ఇందులో ఆరింట ఒకవంతు కేసులు (30,359 కేసులు) ముంబైలోనే రికార్డయ్యాయి. ఇక దేశంలో కొవిడ్‌-19 కారణంగా 4,021 మంది మరణించగా ఇందులో దాదాపు నాలుగో వంతు మరణాలు (988 మరణాలు) ముంబైలోనే సంభవించాయి.  ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారవి ప్రాంతంలో కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కూడా వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగడానికి మరో కారణంగా ఉన్నది. ఇప్పటివరకూ ధారవిలో 1,541 కేసులు నమోదయ్యాయి. 59 మంది మృతిచెందారు. దీంతోపాటు ఇప్పటివరకూ నగరంలో 1,809 మంది పోలీసులకు కరోనా సోకినట్టు తేలగా, వైరస్‌ కారణంగా 12 మంది మరణించారు. ప్రస్తుత గణాంకాల సరళిని విశ్లేషిస్తే రానున్న కాలంలో ప్రపంచంలో అత్యధిక వైరస్‌ కేసులు నమోదయ్యే నగరాల్లో ముంబై అగ్ర స్థానానికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



logo