సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 03:12:10

ప్రపంచంలో మూడో స్థానానికి భారత్‌

ప్రపంచంలో మూడో స్థానానికి భారత్‌

  • దేశంలో మొత్తం కేసులు 6,97,413
  • కొత్తగా 24,248 మందికి కరోనా 
  • 7 లక్షలకు చేరువలో..
  • కోటి దాటిన కరోనా పరీక్షలు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సోకిన రోగుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 24,248 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,97,413కు చేరుకున్నది. అయితే, మహమ్మారి బారి నుంచి కోలుకున్న రోగుల సంఖ్య దేశవ్యాప్తంగా నిలకడగా పెరుగుతుండటం ఊరటే. సోమవారం ఉదయానికి మొత్తంగా 4,24,432 మంది కోలుకోగా, మరో 2,53,287 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న రోగులు 60.85 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, కరోనా కేసుల్లో భారత్‌ శరవేగంగా రష్యాను దాటేసి ఆదివారం మూడో స్థానానికి చేరింది. మృతుల్లో 8వ స్థానంలో కొనసాగుతున్నది. తాజాగా గత 24 గంటల్లో 425 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 19,693కు చేరింది. దేశవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటింది. సోమవారం మధ్యాహ్నం 11 గంటల వరకు 1,00,04,101 మందికి పరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది

మాస్క్‌ లేకుంటే వలంటీర్‌ డ్యూటీ చేయాలి! 

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్‌ ధరించకుండా సంచరించే వాళ్లు.. కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖానల్లో మూడు రోజుల పాటు వలంటీర్‌గా పని చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ (కేంద్ర, రాష్ట్ర, మున్సిపాలిటీ సంస్థల పరిధిలో ఆంక్షలు అమలు) మొదలైంది. 


logo