గురువారం 21 జనవరి 2021
National - Dec 30, 2020 , 11:22:35

యూకే విమానాల‌పై తాత్కాలిక నిషేధం పొడిగింపు..

యూకే విమానాల‌పై తాత్కాలిక నిషేధం పొడిగింపు..

హైద‌రాబాద్‌:  బ్రిట‌న్ విమానాల రాక‌పోక‌లపై ఉన్న నిషేధాన్ని మ‌ళ్లీ పొడిగించారు.  వ‌చ్చే ఏడాది జ‌నవ‌రి ఏడ‌వ తేదీ వ‌ర‌కు తాత్కాలిక నిషేధాన్ని పొడ‌గిస్తున్న‌ట్లు కేంద్ర పౌర విమానయాన‌శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి తెలిపారు.  యూకే విమానాల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  బ్రిట‌న్‌లో ఇటీవ‌ల కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు విమాన‌యాన శాఖ చెప్పింది. ఇటీవ‌ల యూకేలో కొత్త వేరియంట్ ఆన‌వాళ్లు క‌నిపించిన త‌ర్వాత‌.. ఆ దేశంతో అనేక దేశాలు ట్రావెల్ సంబంధాలు తెంచుకున్నాయి.  యూరోప్‌లోని కొన్ని దేశాలు త‌మ స‌రిహ‌ద్దుల్ని కూడా మూసివేశాయి. ఇండియాలో ఇప్ప‌టికే యూకే విమానాల‌ను బ్యాన్ చేశారు. అయితే ఆ నిషేధాన్ని పొడిగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిన్ననే హ‌ర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. 

20 మందిలో కొత్త స్ట్రెయిన్‌..

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న నేపథ్యంలో విమానాల‌పై ఆంక్ష‌ల‌ను పొడిగించారు.  భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త ర‌కం వైర‌స్ కేసులు 20 న‌మోదు అయ్యాయి.  మంగ‌ళ‌వారం ఆరు కేసులు న‌మోదు కాగా, ఇవాళ మ‌రో 14 కేసులు తోడ‌య్యాయి.  ఈ కొత్త  కేసుల‌కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా జ‌రుగుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులంద‌రికీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయ‌నున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో క‌రోనా మ్య‌టేష‌న్ వేరియంట్ రిపోర్ట్ అయ్యింది.  కోల్‌క‌తా మెడిక‌ల్ కాలేజీలోని ఓ సీనియర్ అధికారి కుమారుడికి కొత్త వైర‌స్ సోకింది. లండ‌న్ నుంచి వ‌చ్చిన అత‌నిలో VUI-202012/01 వైర‌స్ ఉన్న‌ట్లు తేల్చారు. 


logo