గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 02:09:25

చైనాను దాటిన భారత్‌

చైనాను దాటిన భారత్‌

  • 85,538కు చేరిన కరోనా కేసులు
  • ప్రపంచవ్యాప్తంగా 46 లక్షలకు చేరువలో

న్యూఢిల్లీ, మే 15: కరోనా కేసుల విషయంలో భారత్‌ చైనాను దాటింది. వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదుకాగా భారత్‌లో 85,538 కేసులు నమోదయ్యాయి. దీంతో ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. అయితే మరణాల పరంగా చూస్తే చైనా కన్నా భారత్‌ కొంత మెరుగైన స్థానంలో ఉన్నది. వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 4,633 మంది మరణించగా.. మన దేశంలో 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మందికి వైరస్‌ సోకగా.. ఇప్పటి వరకు 3 లక్షల మందికిపైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 14,63,301 కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో రష్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ, బ్రెజిల్‌ నిలిచాయి. ఈ దేశాల్లో దాదాపు 2 లక్షల చొప్పున కేసులు వెలుగుచూశాయి. అలాగే ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ, ఇరాన్‌లలో ఒక్కోదేశంలో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో (గురువారం నుంచి శుక్రవారం నాటికి) భారత్‌లో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడిన వారిలో ఇప్పటి వరకు 27,919 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 34.06గా నమోదైంది.


logo