శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 01:57:50

చైనా దొంగదెబ్బతీసినా వెనక్కి తగ్గని సైన్యం

చైనా దొంగదెబ్బతీసినా వెనక్కి తగ్గని సైన్యం

  • రాక్షసదాడికీ వెరువలేదు
  • గడ్డకట్టే చలిలోనూ  72 గంటల్లో గల్వాన్‌ బ్రిడ్జి నిర్మాణం
  • బ్రిడ్జితో సులభతరం కానున్న  బలగాలు, వాహనాల తరలింపు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో భారత్‌ కూడా దీటుగా బదులిచ్చేందుకు అన్ని అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. గల్వాన్‌ లోయలో తాజా ఉద్రిక్తతలకు మూల కారణమైన బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసింది. సైనిక బలగాలు, యుద్ధ వాహనాలను వేగంగా తరలించేందుకు గల్వాన్‌ నదిపై తలపెట్టిన ఈ పోర్టబుల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్మీ ఇంజనీర్లు 72 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి గురువారం సాయంత్రానికి పూర్తిచేశారు. సోమవారం నాడు చైనా దొంగదెబ్బ తీసి 20 మంది భారత జవాన్లను బలితీసుకున్న నేపథ్యంలో, బ్రిడ్జి నిర్మాణంపై ఇక ఏమాత్రం జాప్యంచేయకూడదని ఆర్మీ నిర్ణయించింది.

వీలైనంత త్వరగా బ్రిడ్జిని పూర్తి చేయాలని ఆర్మీ ఇంజనీర్లకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి 72 గంటల పాటు ప్రతికూల పరిస్థితుల్లో, గడ్డకట్టే చలిలో, బలగాల పహారా నడుమ రేయింబవళ్లు శ్రమించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేశారు. దీని పొడవు 60 మీటర్లు. మరోవైపు, ష్యోక్‌ నది వద్ద నిర్మిస్తున్న బీఎస్‌డీబీవో రోడ్డును కూడా వేగంగా పూర్తిచేసేందుకు ఆర్మీ సిద్ధమవుతున్నది. ఈ రోడ్డు, బ్రిడ్జి అందుబాటులోకి వస్తే, ఒక్క గల్వాన్‌లోయలో మాత్రమే కాకుండా కీలక ఉత్తర సెక్టార్లలో చైనాను నిలువరించేందుకు వీలవుతుంది. logo