బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:06:03

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

  • అమర సైనికులకు దేశం నివాళులు

న్యూఢిల్లీ, జూలై 26: పాకిస్థాన్‌ సైనిక మూకలను దునుమాడి కార్గిల్‌ మంచుకొండలపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన క్షణాలను దేశంమొత్తం ఆదివారం స్మరించుకున్నది. కార్గిల్‌ యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న జరుపుకొనే విజయ్‌దివస్‌ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేశంకోసం ప్రాణాలర్పించిన వీర సైనికులకు ప్రముఖులు నివాళులు అర్పించారు. భారత మాత రక్షణలో కార్గిల్‌లో అసువులు బాసిన వీర సైనికులను దేశం ఎన్నటికీ మర్చిపోదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. భారత సైనికుల అసామాన్యమైన ధైర్యసాహసాలు, దేశభక్తికి ఈ యుద్ధమే నిదర్శనమని ఆదివారం ట్వీట్‌ చేశారు. 21వ విజయ్‌ దివస్‌ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తుందని స్పష్టంచేశారు. 1999లో తీవ్రవాదుల ముసుగులో కార్గిల్‌ను ఆక్రమించుకున్న పాక్‌ సైన్యాన్ని తరిమేసేందుకు ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో భారత్‌ సైనిక చర్య చేపట్టింది. మూడు నెలల భీకర పోరాటం తర్వాత జూన్‌ 26న యుద్ధంలో విజయం సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

మీ త్యాగాలు మరువలేనివి: డీజీపీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మీ త్యాగాలు మరువలేనివి, మీకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం’ అంటూ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి కార్గిల్‌ యుద్ధవీరులను స్మరించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌చేశారు. ‘యుద్ధంలో గెలిస్తే మూడు రంగుల జెండా ఎగురేసి వస్తా.. లేదంటే అదే మూడురంగుల జెండా ఒంటికి చుట్టుకొని వస్తా.. నేను తిరిగి రావడం మాత్రం ఖాయం’అంటూ పరమ వీరచక్ర కెప్టెన్‌ విక్రంబాత్ర మాటలను డీజీపీ కోట్‌ చేశారు.


logo