శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:05:30

ముప్పు ఇంకా పోలేదు

ముప్పు ఇంకా పోలేదు

  • అప్రమత్తతతోనే వైరస్‌ అంతం 
  • మనదగ్గరే రికవరీ రేటు ఎక్కువ
  • ‘మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో ప్రధాని 
  • ‘కార్గిల్‌' సైనికుల త్యాగాలను 
  • జాతి మరువబోదని వ్యాఖ్య 

న్యూఢిల్లీ, జూలై 26: కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని ప్రధాని మోదీ దేశప్రజలను హెచ్చరించారు. వైరస్‌ నుంచి కోలుకునే వారి సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమన్నారు. ‘మన్‌కీ బాత్‌' ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కార్గిల్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 

స్వావలంబన సాధించారు

వైరస్‌ను కట్టడి చేయడంలో గ్రామీణ ప్రాంతాలు దేశానికి మార్గనిర్దేశనం చేశాయని తెలిపారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నది. మహమ్మారి బారి నుంచి లక్షలాది మంది ప్రజలను కాపాడటంలో మనం విజయం సాధించాం’ అని మోదీ పేర్కొన్నారు. ముఖానికి మాస్కు, భౌతిక దూరం వంటి నియమాలను అందరూ పాటించాలన్నారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను కొనియాడారు. మధుబని పేరిట బీహార్‌ మహిళలు మాస్కులను తయారు చేస్తూ స్వావలంబన సాధించడాన్ని మోదీ  ప్రశంసించారు. 

వెన్నుపోటు పొడుస్తున్నది

కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌ యుద్ధంలో గెలిచి 21 సంవత్సరాలైన సందర్భంగా సైనికుల త్యాగాలను కొనియాడారు. సైనికుల వీరత్వాన్ని జాతి ఎప్పటికీ మరువబోదన్నారు. పాకిస్థాన్‌ ఒకవైపు స్నేహ హస్తం అందిస్తూనే, మరోవైపు భారత్‌ను వెన్నుపోటు పొడుస్తున్నదని ఆక్షేపించారు.  ఆగస్టు 15న కరోనా మహమ్మారి నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు ప్రతినబూనాలని మోదీ పిలుపునిచ్చారు. బోర్డు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ఈ సందర్భంగా మోదీ కాసేపు ముచ్చటించారు. 


logo