బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:26:13

మరో 47 చైనా యాప్‌లు బ్యాన్‌!

మరో 47 చైనా యాప్‌లు బ్యాన్‌!

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్‌ ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో 47 చైనా యాప్‌లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో నిషేధానికి గురైన టిక్‌టాక్‌ వంటి 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లకు ఈ యాప్‌లు అనుసంధానంగా ఉంటూ మారుపేర్లతో పనిచేస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తాజా చర్యలతో భారత్‌ ఇప్పటివరకూ 106 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసినట్టయింది. తాజాగా నిషేధానికి గురైన యాప్‌ల జాబితాలో ఏయే కంపెనీలు ఉన్నాయన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం తెలియరాలేదు. టిక్‌టాక్‌ లైట్‌, హెలో లైట్‌, షేర్‌ఇట్‌ లైట్‌, బిగో లైవ్‌ లైట్‌, వీఎఫ్‌వై లైట్‌ తదితర యాప్‌లు తాజా నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఈ యాప్‌ల వెర్షన్లు అందుబాటులో లేవు. దీనిపై ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు.  

275 యాప్‌లపై నిఘా

మరో దఫాలో ఏకంగా 275 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ జాబితాలో బహుళ ప్రజాదరణ పొందిన పబ్‌జీ కూడా ఉండటం గమనార్హం. దాదాపు 275 చైనా యాప్‌లపై ఇప్పటికే కేంద్రం నిఘాను పెట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా సైన్యంపై భారత్‌ అత్యాధునిక గూఢచర్య ఉపగ్రహంతో నిఘా పెట్టింది. చైనా స్థావరాన్ని ఈ శాటిలైట్‌ శనివారం ఫొటోలు తీసింది. కారకోరం వద్ద భారతసైన్యం అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులను మోహరించింది. సియాచిన్‌లో పౌరుల సందర్శనకు సైన్యం అనుమతి ఇచ్చింది. ధ్రువాల హిమనదులు కాకుండా సియాచిన్‌ హిమనది ప్రపంచంలోనే అతిపెద్దది. చైనాలోని చెంగ్డూలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని జిన్‌పింగ్‌ సర్కార్‌ సోమవారం మూసివేసింది. 


logo