గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 09:25:41

మీ రాక కోసం భారత్‌ ఎదురుచూస్తోంది..

మీ రాక కోసం భారత్‌ ఎదురుచూస్తోంది..

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికాసేపట్లో భారత్‌లో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. మీ రాక కోసం భారత్‌ ఎదురుచూస్తోంది అని ట్రంప్‌ను ఉద్దేశించి మోదీ ట్వీట్‌ చేశారు. మీ సందర్శన కచ్చితంగా ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అహ్మదాబాద్‌లో కలుద్దామని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ట్రంప్‌ ఆదివారం భారత్‌కు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం 11.40 గంటలకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్రంప్‌ దంపతులను స్వాగతించనున్నారు. అనంతరం అశేష జనవాహిని మధ్య 22 కి.మీ. మేర సాగే భారీ రోడ్‌షోలో ఇరువురు నేతలు పాల్గొంటారు. మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమానికి హాజరవుతారు. సుమారు 1.10 లక్షలమంది సభికులను ఉద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించనున్నారు.  గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి మోదీతోపాటు ట్రంప్‌ హాజరైన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. 


logo
>>>>>>