మంగళవారం 07 జూలై 2020
National - Jun 24, 2020 , 02:48:42

సంధి కుదిరింది

సంధి కుదిరింది

  • వెనక్కి తగ్గేందుకు భారత్‌, చైనా అంగీకారం
  • ఘర్షణలకు అవకాశం ఉన్న అన్నిప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ
  • ప్రకటించిన భారత ఆర్మీ,చైనా విదేశాంగ శాఖ
  • కమాండర్‌ స్థాయిలో 11గంటల  పాటు సాగిన చర్చలు

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో బలగాలను ఉపసంహరించేందుకు భారత్‌, చైనా పరస్పరం అంగీకరించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఇరు దేశాల ఆర్మీకి చెందిన కమాండర్‌ స్థాయి అధికారులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మేరకు భారత సైన్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం రెండు దేశాల అధికారులు సుదీర్ఘంగా 11 గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిపింది. ఎల్‌ఏసీ వద్ద చైనా వైపున ఉన్న మోల్డో వద్ద సామరస్య, సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, రెండు దేశాల బలగాలు వెనక్కి తగ్గేందుకు నిర్ణయించామని వెల్లడించింది. 

తూర్పు లడఖ్‌లోనే కాకుండా భారత్‌, చైనా మధ్య ఘర్షణలకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించేందుకు అంగీకరించామని పేర్కొంది. గల్వన్‌ నుంచి చైనా బలగాలను, సరిహద్దులో ఏర్పాటు చేసిన బంకర్లు, పిల్‌ బాక్సులు, అబ్జర్వేషన్‌ పోస్టులను కూడా తొలగించాలని చైనాను భారత్‌ డిమాండ్‌ చేసిందని ఓ ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమ జవాన్లపై చైనా జవాన్లు దాడి చేసినట్టు భారత్‌ నిలదీసిందని పేర్కొన్నారు. ఈ చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, లేహ్‌కు చెందిన 14 కార్ప్స్‌ కమాండర్‌ పాల్గొనగా, చైనా నుంచి మేజర్‌ జనరల్‌ లియ్‌ లిన్‌, దక్షిణ జిన్‌జియాంగ్‌ మిలటరీ రీజియన్‌ కమాండర్‌ పాల్గొన్నారు. 

సోమవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 10:15 గంటల వరకు మొత్తం 11 గంటల పాటు కొనసాగాయి. రెండు దేశాల ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరగడం ఇది రెండో సారి. జూన్‌ 6న జరిగిన చర్చల్లోనూ బలగాలను వెనక్కి పిలవాలని భారత్‌, చైనా నిర్ణయించాయి. కానీ, జూన్‌ 15న రాత్రి జరిగిన ఘర్షణలు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. ఆ ఘటనలో కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 40 మంది వరకు చైనా సైనికులు కూడా మరణించినట్టు వచ్చిన వార్తలను  చైనా తాజాగా ఖండించింది. కమాండర్‌ ఆఫీసర్‌ చనిపోయింది మాత్రం నిజమేనని పేర్కొంది.

లఢక్‌లో ఆర్మీ చీఫ్‌


సైనిక సన్నద్ధత, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే రెండు రోజుల పాటు లఢక్‌లో పర్యటిస్తున్నారు. లేహ్‌లో దిగీదిగగానే గల్వాన్‌ ఘర్షణలో గాయపడ్డ సైనికులను ఆయన పరామర్శించారు. అక్కడున్న ప్రతి ఒక్క సైనికుడితో ముచ్చటించారు. అనంతరం ఆ ప్రాంతంలో భద్రత తీరుపై కమాండర్లతో చర్చించారు. చైనా ఎలాంటి చర్యకు పాల్పడినా వెంటనే దీటుగా సమాధానం ఇచ్చేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మరిన్ని ప్రాంతాల్లో నరవణే పర్యటిస్తారు. చైనా ఆర్మీతో చర్చలు జరిపిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌తో భేటీ అయ్యి తాజా పరిస్థితులను తెలుసుకోనున్నారు.


logo