శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 03:12:08

గల్వాన్‌లో శాంతి

గల్వాన్‌లో శాంతి

  • తూర్పు లఢక్‌ నుంచి వెనుదిరిగినచైనా బలగాలు 
  • టెంట్ల తొలిగింపు, దళాల ఉపసంహరణ
  • భారత బలగాలు కూడా వెనక్కి.. బఫర్‌ జోన్‌ ఏర్పాటు
  • చర్చల పురోగతిలో భాగమేనన్న ప్రభుత్వ వర్గాలు
  • ఉద్రిక్తతలు తగ్గించాలంటూ చైనా విదేశాంగ మంత్రితో దోవల్‌ చర్చలు
  • చర్చలు జరిగిన మరుసటి రోజే బలగాలను వెనక్కి రప్పించిన చైనా

న్యూఢిల్లీ, జూలై 6: తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంత వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నది. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న గల్వాన్‌ లోయలో ఇప్పటివరకూ వేసిన టెంట్లను చైనా తొలిగించిందని, సైనిక బలగాలను ఉపసంహరించుకున్నదని సోమవారం కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మరోవైపు సరిహద్దుల్లో మోహరించిన బలగాలను భారత్‌ కూడా వెనక్కి రప్పించింది. లఢక్‌లో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించాలని కోరుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ఆదివారం టెలిఫోన్‌ ద్వారా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు సంభవించాయి.


కిలో మీటరు దూరం వరకు వెనక్కి

తూర్పు లఢక్‌లోని కీలకమైన పెట్రోలింగ్‌ పాయింట్‌ 14లో ఏర్పాటు చేసిన టెంట్లు, వివిధ నిర్మాణాలను చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తీసివేసింది. బలగాలను ఉపసంహరించుకున్నది. ఇరుదేశాలకు చెందిన కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల కారణంగానే గల్వాన్‌, గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతాల నుంచి చైనాకు చెందిన వాహనాలు వెనక్కి వెళ్లాయని అధికార వర్గాలు తెలిపాయి. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 నుంచి దాదాపు ఒక కిలో మీటరు దూరం వరకు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు.. ఇంకా ఎంత దూరంవరకు వెళ్తాయో ఇప్పుడే చెప్పలేమని, క్షేత్ర స్థాయిని పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలాఉండగా మరో కీలకమైన ప్రాంతం పాంగోంగ్‌ త్సోలోని ఫింగర్‌ 4, ఫింగర్‌ 8 మధ్య మోహరించిన తన బలగాలను కూడా చైనా వెనక్కి రప్పించిందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. మరోవైపు, ఎల్‌ఏసీ వెంబడి మోహరించిన భారత బలగాలు కూడా వెనక్కి వచ్చినట్టు, ఇరు దేశాలకు చెందిన సైనికులు ఎల్‌ఏసీ వెంబడి బఫర్‌ జోన్‌(ఇరు దేశాలకు చెందిన సైనికులను వేరుచేసే తటస్థ ప్రాంతం)ను నిర్దేశించుకున్నట్టు సమాచారం.

ఉద్రిక్తతలను తగ్గించాం: చైనా

గల్వాన్‌ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ అగ్రగామి దళాలు (ఫ్రంట్‌లైన్‌ ట్రూప్స్‌) సమర్థవంతమైన చర్యలను తీసుకున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజియన్‌ పేర్కొన్నారు. చైనా మాదిరిగానే భారత్‌ కూడా తమ బలగాలను ఉపసంహరించుకొని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

జవాన్ల కోసం చలిని తట్టుకునే ప్రత్యేక టెంట్లు

సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్‌ఏసీ వెంబడి భారత్‌ పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించింది. అయితే తీవ్రమైన చలిగాలులు, మంచు, వర్షాల కారణంగా జవాన్లకు సరైన రక్షణ లేకుండా పోయింది. ఈ క్రమంలో తీవ్రమైన చలి వాతావరణంలో కూడా జవాన్లు తట్టుకునేలా ప్రత్యేకమైన టెంట్లను ఆర్డర్‌ చేయనున్నట్టు ఆర్మీ ఉన్నత వర్గాలు తెలిపాయి.

దోవల్‌ చర్చలతో ముందడుగు

గల్వాన్‌ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించాలని కోరుతూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ఆదివారం టెలిఫోన్‌ ద్వారా చర్చలు జరిగినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై దోవల్‌, వాంగ్‌ యీ ఫోన్‌లో లోతుగా, దాపరికాలు లేకుండా చర్చించారని.. ఎల్‌ఏసీ పూర్వస్థితిని ఇరు దేశాలు గౌరవించాలని, ఎలాం టి ఏకపక్ష నిర్ణయాలను తీసుకోకూడదని చర్చల్లో భాగంగా ఇరువురూ అవగాహనకు వచ్చినట్టు  పేర్కొం ది. కాగా ఈ చర్చలు జరిగిన మరుసటిరోజునే  చైనా తన బలగాలను ఉపసంహరించుకోవడం గమనార్హం. 

ముప్పు ఇంకా పోలేదు!

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు తమ బలగాలను ఉపసంహరించుకున్నట్టు చెప్తున్న చైనా.. మరో మార్గంలో చొరబాట్లకు కుట్ర పన్నుతున్నదా? గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేనేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్‌ఏసీకి అతి సమీపంలో ఉన్న ఉత్తరఖండ్‌లోని బారాహోతి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌కి దగ్గరలో ఉన్న శిప్‌కీ దారిని లక్ష్యంగా చేసుకొని డ్రాగన్‌ దేశం చొరబాట్లకు పాల్పడవచ్చని నిఘా వర్గాల అంచనా. గత నెలలో బారాహోతి, శిప్‌కీ ప్రాంతాల్లో కొందరు బిట్‌ కోడ్‌లతో (0 మరియు 1) కొంత సమాచారాన్ని పంపుకున్నట్టు నిపుణులు తెలిపారు. శాటిలైట్‌ ఫోన్‌ ట్రాఫిక్‌ ద్వారా దీన్ని గుర్తించినట్టు చెప్పారు. పొరుగు దేశాలకు చెందిన బలగాలే ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ‘మేము ఇక్కడ ఉన్నాం’ అనే సందేశాన్ని చైనా సైనికులు ఎవరికో పంపినట్టు బిట్‌ కోడ్‌ను విశ్లేషిస్తే తెలిసిందని వాళ్లు వెల్లడించారు.


logo