శనివారం 30 మే 2020
National - Apr 08, 2020 , 01:36:45

భారత్‌ ఉదారత

భారత్‌ ఉదారత

  • ప్రపంచం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత
  • పరిస్థితులను బట్టి విదేశాలకు తగిన మోతాదులో సరఫరా 
  • క్లోరోక్విన్‌ ఇవ్వకపోతే భారత్‌పై ప్రతిచర్య: డొనాల్డ్‌ ట్రంప్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 7: ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. మలేరియాను నయం చేసేందుకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ), పారాసెటమాల్‌తో పాటు పలు ఔషధాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీంతో కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న అమెరికా వంటి దేశాలకు ఊరట లభించినట్టు అయింది. ‘కరోనా విశ్వమారి వ్యాపిస్తున్న నేపథ్యంలో మానవతా కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. క్లోరోక్విన్‌, పారాసెటమాల్‌ ఔషధాల కోసం భారత్‌పై ఆధారపడి ఉన్న పొరుగు దేశాలకు ఈ ఔషధాల్ని పరిస్థితులను బట్టి  తగిన మోతాదులో ఎగుమతి చేస్తాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. కరోనాతో తీవ్రంగా ప్రభావితమై, ఈ ఔషధాల అవసరం ఉన్న దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తామన్నారు. దేశీయ అవసరాలకు సరిపడిన నిల్వలు ఉంచుకున్న తర్వాత.. పరిస్థితులకు అనుగుణంగా విడతలవారీగా క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, విటమిన్‌ బీ1, బీ12 వంటి 24 ఫార్మా ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేస్తున్నట్టు కేంద్రం మరో నోటిఫికేషన్‌లో వెల్లడించింది. క్లోరోక్విన్‌కు భారత్‌ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నది. కరోనా విశ్వమారిపై పోరాటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందన్న వార్తల నేపథ్యంలో గతనెల 25న క్లోరోక్విన్‌తోపాటు పలు ఔషధాల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించింది. 

ట్రంప్‌ చిటపటలు

అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై చిటపటలాడారు. కరోనా రోగుల చికిత్స కోసం సాయపడుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని, అది ప్రతిచర్యకు కూడా దారి తీయొచ్చని హెచ్చరించారు. అమెరికాతో భారత్‌కి మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే భారత్‌ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివారం భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. క్లోరోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. దానికి ప్రతిచర్య ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ స్పందిం కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాల్ని ముందు దేశంలోఅవసరమైన వారికి అందజేసిన తర్వాత విదేశాలకు ఎగుమతి చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  


logo