గురువారం 02 జూలై 2020
National - Jun 26, 2020 , 12:58:18

స్విస్ బ్యాంక్ ఖాతాలు.. 77వ స్థానంలో భార‌త్

స్విస్ బ్యాంక్ ఖాతాలు.. 77వ స్థానంలో భార‌త్

హైద‌రాబాద్‌: స్విస్ బ్యాంకుకు సంబంధించి తాజా రిపోర్ట్ వెల్ల‌డైంది.  ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భార‌త్ 77వ స్థానంలో నిలిచింది. గ‌త ఏడాది చివ‌రి క‌ల్లా స్విస్ బ్యాంకులో సొమ్ము దాచిపెట్టిన భార‌తీయ పౌరులు, సంస్థ‌ల జాబితా ఆధారంగా ఈ కొత్త ర్యాంకుల‌ను వెల్ల‌డించారు.  స్విస్ బ్యాంక్ ఖాతాల్లో టాప్ ప్లేస్‌ను బ్రిట‌న్ చేజిక్కించుకున్న‌ది.  2018లో 74వ స్థానంలో ఉన్న భార‌త్‌.. ఇప్పుడు 77వ స్థానానికి ప‌డిపోయింది. స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్ తాజాగా దీనికి సంబంధించిన గ‌ణాంకాల‌ను రిలీజ్ చేసింది.

స్విస్ బ్యాంకులో డ‌బ్బు దాస్తున్న భార‌తీయుల సంఖ్య క్ర‌మంగా ప‌డిపోతున్న‌ది. ఎస్ఎన్‌బీకి చెందిన‌ భార‌తీయ‌ బ్రాంచిల్లోనూ ఆ సంఖ్య త‌గ్గిన‌ట్లు తేలింది. స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్ట‌న సొమ్ములో భార‌త వాటా కేవ‌లం 0.06 శాతం మాత్ర‌మే ఉన్న‌ట్లు స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. ఇక అత్య‌ధిక స్థాయిలో సొమ్ము దాచిన దేశాల్లో బ్రిట‌న్ మొద‌టిస్థానంలో ఉన్న‌ది. స్విస్ విదేశీ ఫండ్‌లో బ్రిట‌న్ వాటా 27 శాతం ఉన్న‌ట్లు తేలింది. 

ఎస్ఎన్‌బీ డేటా ప్ర‌కారం.. స్విస్ బ్యాంకులో భార‌తీయులు సొమ్ము భ‌ద్ర‌ప‌రిచే విధానం 5.8 శాతం ప‌డిపోయిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.  2019లో భార‌తీయులు డిపాజిట్ చేసే సొమ్ము 6625 కోట్లకు ప‌డిపోయిన‌ట్లు బ్యాంకు రిపోర్ట్ చెబుతున్న‌ది. logo