గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 10:33:55

వర్క్ ఫ్రమ్ హోమ్ తో పెరుగుతున్న ఉత్పాదకత

వర్క్ ఫ్రమ్ హోమ్ తో పెరుగుతున్న ఉత్పాదకత

బెంగళూరు : గతంలో ఆఫీస్ కు వెళ్లి పనిచేసేప్పుడు నిర్ణీత సమయం మాత్రమే పని ఉండేది. ఆఫీస్ నుంచి వచ్చేస్తే ఇక మళ్ళీ మరుసటి రోజు మాత్రమే పని మొదలయ్యేది. వర్కింగ్ డే లోనూ మధ్యలో టి బ్రేక్, లంచ్ బ్రేక్ ఉండేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు కొంత వెసులుబాటు ఉండేది. కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అవేమీ కుదరడం లేదు. ఒక నిర్ణీత సమయం అంటూ ఏమీ లేకుండా ఎప్పుడైనా పనిచెబుతున్నారు. వర్క్ పూర్తయ్యేంత వరకు పని చేస్తూనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాధారణం కంటే కనీసం 20-25శాతం అధిక పని గంటలు పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఈ విధానంతో ఉద్యోగుల ఉత్పాదకత గణనీయంగా పెరిగిపోయింది.

కాబట్టి కంపెనీలకు ఇదొక అద్భుతమైన అవకాశంలా కనిపి స్తున్నది. దీంతో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ను పొడిగిస్తూ పోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కి మాత్రమే పరిమితమైన కాన్సెప్ట్. లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని రంగాలకూ విస్తరించింది. కేవలం తయారీ రంగంలో తప్పనిసరిగా ఆఫీస్ కు రావాల్సిన సిబ్బంది మినహా మిగితా అందరూ ఇంటి నుంచే పనిచేసేలా ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలుత ఇదొక తాత్కాలిక చర్య మాత్రమే అనుకున్నప్పటికీ... ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ తో ఇకపై  వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పర్మనెంట్ అయ్యేలా ఉందని కంపెనీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి విధానంలోనూ ఉన్నట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ లోనూ మంచి, చెడు మిళితమై ఉన్నాయి.

అయినా సరే ఇందులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలు ఈ విధానానికి ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవు తున్నది. ఐటీ కంపెనీలు కాకుండా తయారీ రంగంలో ఉన్న ఫిలిప్స్ లాంటి కంపెనీలు సైతం ఈ విధానానికి జై కొడుతుండటం విశేషం. కేవలం 15శాతం మందిని మాత్రమే ఆఫీస్ కు వచ్చి పని చేసేందుకు అనుమతిస్తున్నది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ -19 తీవ్రత అధికంగా ఉండటంతో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ చర్యలకు ప్రాధాన్యమిస్తున్నాయి.

వారు ఇంటి నుంచి పనిచేసినా ప్రొడక్టివిటీ అధికంగా ఉండటంతో అదే వారికి శ్రీ రామ రక్ష లా ఉంటుందని కంపెనీల విశ్వాసం. ఎక్కువ మంది ఆఫీస్ కు వచ్చి పనిచేస్తే వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉంటాయి కాబట్టివర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే బెటర్ అని భావిస్తున్నాయి. ఒకవైపు కరోనా రాకుండా చూసుకుంటూనే, మరో వైపు బిజినెస్ దెబ్బతినకుండా పనిచేసేందుకు ఈ విధానం చాలా మెరుగ్గా ఉండటం వల్ల ఇక మీదట దీనిని పర్మనెంట్ చేయాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి.

  

 

తాజావార్తలు


logo