మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 14:43:23

ముజఫర్‌పూర్‌లో భారీ వర్షం.. స్తంభించిన జన జీవనం

ముజఫర్‌పూర్‌లో భారీ వర్షం.. స్తంభించిన జన జీవనం

ముజఫర్‌పూర్‌ : బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై వరద చేరడంతో రాకపోకలు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. సహాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు చేతులెత్తేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. సమస్యలను పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్తే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారని, వారే ఇలా అంటే తామెక్కడికి వెళ్లాలని రజ్‌నీశ్‌ కుమార్‌ భారతి అనే స్థానికుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వారికి తప్పక గుణపాఠం చెబుతామని ఆక్రోశం వెల్లగక్కాడు.

‘అధికారులు ఇండ్లలో కూర్చొని నిశ్చతంగా టీ తాగుతున్నారు. ఇక్కడ మాత్రం తిండిగింజలు కూడా తడిసిపోయి మేం కష్టాల్లో ఉన్నాం. మాకు తినడానికి కూడా ఏం లేదు. అధికారులు కనీస సహాయక చర్యలు తీసుకోలేదు. ఇక్కడ డ్రైనేజీలు శుభ్రం చేసి పదేళ్లు దాటింది’. అని మరొకరు ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి అజిత్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీ ముజఫర్‌పూర్‌ను స్మార్ట్‌ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు ఐదేళ్లుగా ఇందుకోసం పని చేస్తున్నారు. బహుశా స్మార్ట్‌ అంటే ఇదేనేమో’ అని ఎద్దేవా చేశారు.


logo