సోమవారం 06 జూలై 2020
National - Jun 29, 2020 , 18:29:06

క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకం

క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకం

జాజ్‌పూర్‌ : కరోనా నియంత్రణకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వారి నుంచి వైరస్‌ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచిరాష్ట్రానికి వచ్చిన వారు క్వారంటైన్‌ పూర్తి చేస్తే రూ.2వేల ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. ఇందుకు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జాజ్‌పూర్‌ జిల్లాలో 1300పైగా తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆ జిల్లా మెజిస్ట్రేట్‌ రంజన్‌కుమార్‌ దాస్‌ తెలిపారు. 

సంస్థాగత క్వారంటైన్‌ లేదా హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్వారంటైన్‌లో ఉన్న పెద్దలకు రోజుకు రూ.120, చిన్నారులకు రూ.100 విలువైన భోజనాన్ని అందిస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో పని చేయాలనుకునే వారికి గార్డెనింగ్‌, పేయింటింగ్‌ తదితర పనులు అప్పగిస్తున్నారు. ఇలా గరిష్ఠంగా 10రోజులు పని కల్పించి రోజుకు రూ150 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలను జిల్లా మెజిస్ట్రేట్‌ పర్యవేక్షిస్తారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి టూత్‌బ్రష్‌, పేస్టు. బకెట్‌, సాన్నపు సబ్బు, దుస్తుల సబ్బు, మంచం, బెడ్‌షీట్లు తదితర వస్తువులు అందజేస్తున్నారు. ఉదయం అల్పాహారం, టీతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిస్కెట్లు, స్నాక్స్‌తోపాటు రాత్రి భోజనం పెడుతున్నారు. క్వారంటైన్‌లో ఉంటున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒడిశానే. 


logo