సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 19:21:41

ఊరిని ముంచెత్తిన సముద్రం

ఊరిని ముంచెత్తిన సముద్రం

కొచ్చి : వాతావరణంలో మార్పులు కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా తోడవడంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. కేరళ సముద్రతీరంలోని చెల్లానం గ్రామాన్ని సముద్రం ముంచెత్తుతుండటం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈ ఏడాదిలో రెండు సార్లు ఈ గ్రామాన్ని సముద్రం ముంచెత్తింది. చెల్లానం గ్రామంలోని పలువురు మత్స్యకారులు తమ సర్వస్వం కోల్పోయి ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొచ్చికి 20 కిలీమీటర్ల దూరంలోని సముద్రతీర గ్రామమైన చెల్లానంలో ఉంటున్న దాదాపు వంద కుటుంబాలు సముద్రుడి ఉగ్రరూపంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గ్రామంలోని చాలా ఇండ్లలో మోకాలు లోతు నీరు చేరింది. 

సముద్రం ఉప్పొంగిందంటో మా ఊర్లోకి నీరు వచ్చి చేరుతుంది. దాంతో సమీపంలోని స్కూళ్లో తలదాచుకుంటాం. అంతకుమించి మరే కొత్తదనాన్ని చూడటం లేదు అంటున్నారు 52 ఏండ్ల వయసున్న మత్స్యకారుడు అగస్టీన్. గ్రామంలోని సముద్రం నీరు రాకుండా ఇసుక సంచులు అడ్డుగా వేయడం ఒక్కటే పరిష్కారం కాదని ఆయన చెప్తున్నారు. అయితే, సముద్రతీర ప్రాంతంలో రాతిగోడ కట్టాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని ఎర్నాకులం డిప్యూటీ కలెక్టర్ షీలాదేవి తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ గ్రామంలోకి సముద్రం నీరు రాకుండా చేయాలని చెల్లానం గ్రామస్థులు కోరుకుంటున్నారు.logo