గురువారం 02 జూలై 2020
National - Jun 26, 2020 , 12:30:24

190 మంది పోలీసులకు కరోనా

190 మంది పోలీసులకు కరోనా

ముంబై: దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తుండటంతో సాధారణ ప్రజలతోపాటు పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకిందని, ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 4516 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని, మొత్తం 56 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడిన 3444 మంది పోలీసులు కోలుకున్నారని వెల్లడించింది. 

ముంబై పోలీసులు కరోనా బారినపడుతుండటంతో నగరంలో ప్రత్యేకంగా మూడు క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ పీఆర్వీవో ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు. అవి కోలే కల్యాణ్‌, మరోల్‌, మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడు కేంద్రాల్లో కలిపి మొత్తం వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనా వల్ల ముంబైలో ఇప్పటికే 37 మంది పోలీసులు మరణించారు. 

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,47,741 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 63,357 యాక్టివ్‌ కేసులు ఉండగా, 77,453 మంది కోలుకున్నారు. ఈ వైరస్‌బారిన పడినవారిలో ఇప్పటివరకు 6931 మంది మరణించారు.


logo