బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 04:07:10

సాహో సైనికా

సాహో సైనికా

  • లేహ్‌లో జవాన్లకు ప్రధాని ప్రశంస
  • ఆశ్చర్యకర పర్యటనతో భరోసా
  • విస్తరణవాద శకం ముగిసింది
  • నడుస్తున్నది అభివృద్ధి శకమే
  • చైనాపై ప్రధాని మోదీ నిప్పులు 

శత్రువుకు మీ ఉగ్రరూపం చూపారు

మీ ధైర్యం హిమాలయాలకన్నా ఉన్నతం

దేశం మీ చేతుల్లో సురక్షితంగా, ఎంతో శక్తిమంతంగా ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నాడు. మీ ధైర్యసాహసాలు మీరు నిలబడి ఉన్న ఈ పర్వతాలకన్నా ఉన్నతమైనవి. మీ బాహువులు మీ చుట్టూ ఉన్న కొండలకన్నా దృఢమైనవి. మీ ఆత్మవిశ్వాసం, మీ మనోనిబ్బరం, మీ విశ్వాసం అంగుళం కూడా కదిలించ వీలుకాని ఈ మహాపర్వతాలకన్నా స్థిరమైనవి.

- ప్రధాని మోదీ


లఢక్‌, జూలై 3: భారత వీర సైనికుల ధైర్యసాహసాలు హిమాలయాలకన్నా ఉన్నతమైనవని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. మన సైనికులు తమ ఉగ్రరూపాలను ప్రదర్శించి శత్రువులను కకావికలం చేశారని ప్రశంసించారు. ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందని, ఇప్పడు నడుస్తున్నది అభివృద్ధి శకం మాత్రమేనని చైనానుద్దేశించి వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఎప్పుడో ఓడిపోయారన్నది చారిత్రక సత్యమని స్పష్టం చేశారు. దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తూ లఢక్‌లోని లేహ్‌లోగల నిము సైనిక బేస్‌ను ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు.

మన సైనికులది ఉక్కు సంకల్పం

భారత సైనికుల సంకల్పం మహా పర్వతాలకన్నా దృఢమైనదని ప్రధాని మోదీ కీర్తించారు. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత భారత సేనల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు లేహ్‌లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. సైనికులతో సరదాగా గడిపి ముచ్చటించారు. అనంతరం సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ప్రసంగించారు. ‘దేశం మీ చేతుల్లో సురక్షితంగా, ఎంతో శక్తిమంతంగా ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నాడు. మీ ధైర్యసాహసాలు మీరు నిలబడి ఉన్న ఈ పర్వతాలకన్నా ఉన్నతమైనవి. మీ బాహువులు మీ చుట్టూ ఉన్న కొండలకన్నా దృఢమైనవి. మీ ఆత్మవిశ్వాసం, మీ మనోనిబ్బరం, మీ విశ్వాసం అంగుళం కూడా కదిలించ వీలుకాని ఈ మహాపర్వతాలకన్నా స్థిరమైనవి’ అని మోదీ కొనియాడారు. ప్రధాని వెంట రక్షణదళాల అధిపతి బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి ఎంఎం నరవణే ఉన్నారు. గల్వాన్‌ ఘర్షణలో గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న దవాఖానను మోదీ సందర్శించి సైనికులను పరామర్శించారు.

విస్తరణవాద శకం ముగిసింది

చైనాపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. విస్తరణవాద శకం ముగిసిందని స్పష్టంచేశారు. విస్తరణవాద శక్తులు మొత్తం మానవజాతినే ప్రమాదంలోకి నెట్టాయని విమర్శించారు. ‘బలహీనతతో శాంతిని స్థాపించలేము. బలంతోనే అది సాధ్యం. మనం వేణువును ఊదే కృష్ణుడిని పూజిస్తాం. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడి కూడా ఆరాధిస్తాం’ అని పేర్కొన్నారు. సైన్యాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని, ఆయుధాలను అందించామని చెప్పారు. లఢక్‌ సంస్కృతి సంప్రదాయాలను ప్రశంసించిన మోదీ ప్రముఖ సాధువు కుశోక్‌ బకులా రింపోచే బోధనలను గుర్తుచేశారు.

భారత్‌ మాతా కీ జై

మోదీ పర్యటనతో లేహ్‌లోని మంచుకొండలు భారత్‌ మాతా కీ జై, వందేమాతరం నినాదాలతో దద్దరిల్లాయి. 11 వేల అడుగుల ఎత్తులో మంచుకొండల్లో వీర సైనికుల ఆవేశం ఉప్పొంగింది. 

సైనికుల్లో నైతిక ైస్థెర్యాన్ని నింపారు: నడ్డా

లఢక్‌లో మోదీ పర్యటన సైనికుల్లో నైతిక ైస్థెర్యాన్ని నింపుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాగా, చైనా సైన్యం చొరబాట్లపై ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు.


logo