శనివారం 28 మార్చి 2020
National - Feb 29, 2020 , 11:38:40

గుండె గుండెకో వ్యథ!

గుండె గుండెకో వ్యథ!

ఢిల్లీలో హంతకమూకలు సాగించిన హింసాకాండ.. అనేక కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది. కండ్ల ముందే అయినవారిని కోల్పోయి ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. గత మూడు రోజులుగా మత ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీంతో బాధితుల కుటుంబాలను మీడియా పలుకరించగా.. కన్నీరే సమాధానంగా వస్తున్నది. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఎవరిని కదిపినా కన్నీళ్లే. ఉన్మాదుల విధ్వంసకాండలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మరోవైపు, గురుతేజ్‌ బహదూర్‌ దవాఖాన వద్ద బాధితుల రోదనలతో పరిస్థితి హృదయవిదారకంగా ఉన్నది. హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువ మందికి బుల్లెట్‌ గాయాలైనట్లు వైద్యులు చెప్తున్నారు.

  • ఢిల్లీ హింసాకాండలో సర్వం కోల్పోయిన కుటుంబాలు.. ఎవరిని కదిపినా కన్నీళ్లే

             

కాల్చి.. మంటల్లోకి తోసి..

శివ విహార్‌లో నివసించే అన్వర్‌ను అల్లరిమూకలు దారుణంగా హతమార్చాయి. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో అన్వర్‌ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనను బయటకు లాగి ఇంటికి నిప్పుపెట్టారు. అనంతరం ఆయనపై కాల్పులు జరిపారు. అంతటితో ఆగని కర్కశులు.. అన్వర్‌ను అలాగే మంటల్లోకి తోసేశారు. కండ్లారా చూడ్డం తప్ప తానేమీ చేయలేకపోయానని అన్వర్‌ సోదరుడు సలీమ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మానవత్వంపై తనకు ఇంకా విశ్వాసం ఉన్నదని, తమకు ఒక హిందూ కుటుంబం ఆశ్రయమిచ్చిందని చెప్పారు. అన్వర్‌ మేకల పెంపకందారుడు. ఆ మేకలను ఎత్తుకెళ్లిపోయిన మూకలు.. తమ ఇంటిలోని బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులనూ దోచుకెళ్లారని సలీమ్‌ వాపోయారు. వచ్చే నెలలో తన కుమార్తె వివాహం ఉన్నదని, అయితే తాము సర్వం కోల్పోయామని కన్నీరుమున్నీరయ్యారు.

 

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఇంటినీ వదల్లేదు


ఈశాన్య ఢిల్లీలో దుండగులు బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మొహద్‌ అనిస్‌ ఇంటినీ వదల్లేదు. ఇంటి బయట ‘బీఎస్‌ఎఫ్‌ జవాన్‌' అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్‌ను చూసైనా తమను కనికరిస్తారన్న అనిస్‌ కుటుంబం ఆశలు నెరవేరలేదు. ఇంటి బయట ఉన్న కార్లకు నిప్పుపెట్టిన మూకలు అనంతరం ఇంటిని తగులబెట్టారు. పాకిస్థానీ బయటకు రా.. మేం పౌరసత్వం ఇస్తాం.. అంటూ నినదించారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అనిస్‌ కుటుంబం ఎలాగోలా బయటపడింది. ఆ ఇంటిలో వచ్చే రెండు నెలల్లో ఇద్దరికి వివాహం కావాల్సి ఉన్నది. అయితే నగలు, నగదు అన్నీ బుగ్గిపాలయ్యాయని ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ఇది బయటవారి పనేనని, స్థానికంగా ఉన్న హిందువులు తమకు సాయం చేశారని వారు చెప్పారు.


పెండ్లయిన 10 రోజులకే..


ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతుల కలలను అల్లరి మూకలు ఛిద్రం చేశాయి. గోకుల్‌పురిలోని  ఓ ఇంటిలో నివాసముంటున్న ఎలక్ట్రిషియన్‌ అష్వక్‌ హుస్సేన్‌కు(22) పదిరోజుల కిందటే వివాహమైంది. మంగళవారం సాయంత్రం పని నిమిత్తం బయటకువెళ్లిన అతడిని దుండగులు హతమార్చారు. దవాఖాన నుంచి ఈ మేరకు ఫోన్‌ రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తన కుమారుడికి ముస్లింల కంటే హిందువుల్లోనే ఎక్కువ మంది మిత్రులు ఉన్నారని, పెండ్లికి వారంతా హాజరై సందడి చేశారని అష్వక్‌ తండ్రి ఉద్వేగంగా తెలిపారు. ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి ముస్లిం యువకులు రక్షణగా నిలువడంతో దుండగులు దాన్ని ఏమీ చేయలేదని తెలిపారు.


తప్పించుకునేందుకు నుదుట తిలకం

ఘోండా ప్రాంతానికి చెందిన పర్వేజ్‌ ఆలం (50) గ్యారేజ్‌ నడుపుతున్నాడు. మంగళవారం విధ్వంసం సృష్టిస్తున్న అల్లరిమూకలను వారించేందుకు వెళ్లిన ఆయనను ఓ దుండగుడు వెనుక నుంచి కాల్చాడు. దీంతో ఆయన కుమారుడు మొహమ్మద్‌ సాహిల్‌ (20), సమీప బంధువును వెంటబెట్టుకుని తండ్రిని బైక్‌పై దవాఖానకు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో దుండగుల బారి నుంచి తప్పించుకునేందుకు వారు నుదుటిపై తిలకం దిద్దుకున్నారు. అయితే ఆలం దవాఖానలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 


మురికి కాల్వలో సోదరుల మృతదేహాలు

ఆమిర్‌ (25) ఘజియాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సోదరుడు అక్రమ్‌ (16) అతడికి సాయంగా ఉంటున్నాడు. వారి కుటుంబం గోకుల్‌పురిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని కలిసేందుకు ఇంటికి వస్తామంటూ మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆమిర్‌ తన పెద్దన్నకు ఫోన్‌చేశాడు. అల్లర్లు జరుగుతున్నాయని, రావొద్దంటూ అతడు వారించాడు. గోకుల్‌పురి తనకు బాగా తెలుసని, ఎలాగొలా వస్తానని ఆమిర్‌ చెప్పాడు. అయితే రాత్రి 10 అయినా వారు ఇంటికి చేరలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఒక మహిళా పోలీస్‌ వారి మృతదేహాలను తాను జీటీబీ దవాఖానలో చూసినట్లు చెప్పడంతో వారి గుండె పగిలింది. మురికి కాల్వలో సోదరులిద్దరి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులుతెలిపారు.


కుదుటపడుతున్న పరిస్థితులు 42కి చేరిన మృతుల సంఖ్య

గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని స్థాయిలో తీవ్రమైన మత ఘర్షణలతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీ క్రమంగా కుదుటపడుతున్నది. అల్లర్లకు కేంద్ర స్థానమైన ఈశాన్యఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిత ప్రాంతాల్లో 7వేల మంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పో యిన వారి సంఖ్య శుక్రవారంనాటికి 42కు చేరుకున్నది. మరో 250 మంది గాయపడ్డారు.మరోవైపు, ఢిల్లీ అల్లర్లపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భారత్‌ను కోరింది. 


logo