శుక్రవారం 03 జూలై 2020
National - Jan 16, 2020 , 12:38:13

జమ్మూకశ్మీర్‌ పర్యటనకు కేంద్ర మంత్రులు

జమ్మూకశ్మీర్‌ పర్యటనకు కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే. నాడు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. ఇప్పుడిప్పుడే సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు ఆరు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో మొత్తం 36 మంది నాయకులు ఉంటారు. పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి అక్కడి ప్రజలకు కేంద్ర మంత్రులు వివరించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత చేపట్టిన అభివృద్ధిపై ప్రజలకు తెలుపనున్నారు. అయితే ఈ పర్యటన జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు కొనసాగనుంది. జమ్మూకు 51 ట్రిప్పులు, శ్రీనగర్‌కు 8 ట్రిప్పులు ఉండేలా ప్లాన్‌ చేశారు. కశ్మీర్‌ వ్యాలీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దశలవారీగా అక్కడ ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌ పర్యటనకు వెళ్లే వారిలో పురుషోత్తం సింగ్‌ రూపాలా, మహేంద్ర నాథ్‌ పాండే, జనరల్‌ వీకే సింగ్‌, స్మృతి ఇరానీ, జి. కిషన్‌ రెడ్డి, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అనురాగ్‌ ఠాకూర్‌, జితేంద్ర సింగ్‌, హర్దీప్‌ పూరి, పీయూష్‌ గోయల్‌, రవి శంకర్‌ ప్రసాద్‌, కిరణ్‌ రిజిజుతో పాటు పలువురు ఉన్నారు.


logo