గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 15:50:07

బిహార్‌లో 15ఏళ్లలో 55 కుంభకోణాలు : తేజస్వీయాదవ్‌

బిహార్‌లో 15ఏళ్లలో 55 కుంభకోణాలు : తేజస్వీయాదవ్‌

పాట్నా : నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ ఆదివారం మండిపడ్డారు. గత 15ఏళ్లలో రాష్ట్రంలో 55 కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, ఇందులో ఏ అధికారిపైనా, రాజకీయ నాయకుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. శ్రీజన్ కుంభకోణంలో కనీసం రూ.3,300కోట్లు దుర్వినియోగం జరిగాయని, రాష్ట్రం నుంచి దోచుకున్న వేల కోట్లు ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. చర ఘోటాలా (పశుగ్రాసం కుంభకోణం) అంతా అతిశయోక్తని, అది కేవలం రూ.46లక్షల కుంభకోణం మాత్రమేనన్నారు. కేసు కోర్టులో ఉన్నందున మరింత చెప్పలేనన్నారు.

గత ఏడాది పాట్నాలో వరదలకు గురైనప్పుడు అధికారులు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజాధనం లూటీ అవుతుందని, ఆ డబ్బును తిరిగి రాబట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో సీఎం చెప్పాలని తేజస్వీయాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో ఉత్తర బీహార్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. 'ఆనకట్టల పని ఆగిపోయిందని, ఉత్తర బీహార్ మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. పాట్నా కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాలు కూడా జలప్రవాహంలో మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రోడ్లు మురికి కాలువలయ్యాయని, ప్రభుత్వం మురుగు నీటి నిర్వహణపై ముందస్తు కసరత్తు చేయాల్సి ఉండేదన్నారు. ఈ పరిస్థితి వర్షాకాలంలో ఎదురవుతుందని ప్రభుత్వానికి తెలుసునని, కానీ ఏం చేయడం లేదని ఆరోపించారు.


logo