శనివారం 28 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 18:19:00

ఈపీఎఫ్‌వో సీబీటీ భేటీ.. త్రీ గుడ్ న్యూస్‌, వ‌న్ బ్యాడ్ న్యూస్‌

ఈపీఎఫ్‌వో సీబీటీ భేటీ.. త్రీ గుడ్ న్యూస్‌, వ‌న్ బ్యాడ్ న్యూస్‌

ఢిల్లీ : ఈపీఎఫ్‌వో సీబీటీ(సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్) 227వ సమావేశం 9 సెప్టెంబరు,2020న జరిగింది. పీఎఫ్‌ వడ్డీ రేట్లు, ఈపీఎస్‌95 మినిమం పెన్షన్‌పై బోర్డు స‌భ్యులు ఈ భేటీలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ప్రయోజనం చేకూరేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేట్లను నిర్ణయించింది. 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించ‌నున్న‌ట్లు ప్రకటించింది. వడ్డీ చెల్లింపులను రెండు విడతల్లో జమచేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 8.15 శాతం వడ్డీని అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే వడ్డీ రేటు పీఎఫ్ ఖాతాదారులకు వర్తింప‌జేస్తుంది. మొదటివిడ‌త‌ 8.15 శాతం వడ్డీని అక్టోబర్‌లో మిగతా 0.35 శాతం వడ్డీని డిసెంబర్‌ 30వ తేదీ వరకు జమ చేయనున్నట్లు వెల్ల‌డించింది.

ఈడీఎల్‌ఐ ఇన్సూరెన్స్‌ పెంపు..

పీఎఫ్‌ సబ్‌స్రైబర్స్‌కు మరో శుభవార్త ఏంటంటే ఈడీఎల్‌ఐ(ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్‌డ్‌ ఇన్సూరెన్స్‌) కవరేజ్‌ కింద పీఎఫ్‌ సబ్‌స్రైబర్స్‌ పొందే ఉచిత జీవిత బీమా కవరేజీ పెరిగింది. సర్వీసులో ఉండగా పీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే.. మరణానంతరం నామిని కనిష్ఠంగా రూ.2.5 లక్షలు, గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు బీమా నగదు పొందనున్నారు. 

నేరుగా ఈపీఎఫ్‌వోకు అప్పీల్‌ చేయొచ్చు..

పీఎఫ్‌ సబ్‌స్రైబర్స్‌కు మూడో శుభవార్త ఏంటంటే ఏదైనా తనిఖీ నిమిత్తం, వివిధ అంశాల్లో వివాదాలు తలెత్తితే ఉద్యోగులు ఇకపై నేరుగా ఈపీఎఫ్‌వోకే అప్పీల్‌ చేయొచ్చు. దీనివల్ల విలువైన కాలం, డబ్బు ఆదా అవుతాయి. ఏ సమస్యనైనా పరిష్కరించుకునేందుకు ఆన్‌లైన్‌లో నేరుగా ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేసి ప్రయోజనాలు పొందొచ్చు.   

ఈపీఎస్‌-95 పెన్షనర్లకు నిరాశే.. 

ఈపీఎస్‌-95 పెన్షనర్స్‌ ఎంతో కాలంగా కనీస పెన్షన్‌ను పెంచాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి సైతం పలుమార్లు లేఖ రాశారు. 9 సెప్టెంబర్‌,2020న జరిగిన ఈపీఎఫ్‌వో సీబీటీ సమావేశంపై ఎంతో ఆశపెట్టుకున్నారు. కనీస పెన్షన్‌ పెంపుపై భేటీలో పెద్ద నిర్ణయమే తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా సమావేశంలో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయం ఈపీఎస్‌-95 పెన్షనర్లను నిరాశకు గురిచేసింది.