శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 13:52:27

101 వస్తువుల‌‌ దిగుమ‌తిపై నిషేధం!

101 వస్తువుల‌‌ దిగుమ‌తిపై నిషేధం!

న్యూఢిల్లీ: దేశంలో 101 ర‌కాల‌ రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా‌ ప్రకటించారు. 'ఆత్మనిర్భర్‌ భారత్' కార్య‌క్ర‌మానికి ఊతమివ్వడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని ఆయ‌న‌ వెల్లడించారు. ఇక నుంచి ఆయుధ సంపత్తి సహా రక్షణశాఖ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న నాలుగేండ్లు (2020- 2024) రక్షణ రంగ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉంటాయ‌ని తెలిపారు. 

ఇక‌పై శతఘ్నులు, రైఫిళ్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, రాడార్ల వంటి వాటిని ఇత‌ర దేశాల నుంచి దిగుమతి చేసుకోబోమని రక్షణశాఖ మంత్రి స్పష్టంచేశారు. సాయుధ దళాల అవసరాలను గుర్తించి వాటిని రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామని, దేశీయంగానే వాటిని ఉత్పత్తి చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం 101 ఉత్పత్తులతో జాబితా సిద్ధం చేశామని, మరిన్ని రక్షణ పరికరాలను గుర్తించి వాటిపై కూడా నిషేధం విధిస్తామని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. 

రక్షణ బడ్జెట్‌ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దులుగా విభజించామని రాజ్‌నాథ్ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నిషేధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇక్కడి పరిశ్రమలకు గడువు ఇస్తామని తెలిపారు. తాజా నిర్ణయం భారత రక్షణ పరిశ్రమకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. వీటి ఉత్పత్తికి సంబంధించి శక్తిసామర్థ్యాలను నిపుణులు, తయారీ సంస్థలతో సుదీర్ఘంగా చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. 

కాగా, గ‌త ఐదేండ్ల కాలంలో 230 ర‌కాల ర‌క్ష‌ణ‌ పరికరాల కోసం దాదాపు రూ.3.35 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో రానున్న ఆరేడేండ్ల‌లో దాదాపు 7 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను దేశీయ పరిశ్రమతోనే కుదుర్చుకుంటామని పేర్కొన్నారు. వీటిలో లక్షా 30 వేల కోట్ల చొప్పున ఆర్మీ, వైమానిక దళాలకు సంబంధించినవి ఉండగా, మరో లక్షా 40 వేల కోట్లు విలువైన వస్తువులు నావికా దళానికి చెందిన ఉత్పత్తులు ఉండనున్నట్లు ర‌క్ష‌ణ‌మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo