మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 19:47:49

ప్రజాసంక్షేమానికి పథకాల అమలే అత్యంత కీలకం : ఉపరాష్ట్రపతి

ప్రజాసంక్షేమానికి పథకాల అమలే అత్యంత కీలకం : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజా సేవల పంపిణీ వ్యవస్థతోపాటు ప్రజలకు న్యాయం చేయడం, ప్రజల సమస్యలకు ప్రభుత్వ వ్యవస్థ స్పందిస్తున్న తీరు తదితర అంశాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాంటి మార్పునే నేటి భారతం కోరుకుంటున్నదని పేర్కొన్నారు. 

శనివారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐఐపీఏ) 66వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)ను అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాల అమలులో తమవంతు కృషిచేస్తూ.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న సివిల్ సర్వెంట్లు, వైద్యనిపుణులు, భద్రతా సిబ్బంది, ఉపాధ్యాయులతో పాటు వివిధరంగాల ప్రముఖుల సేవలను విస్మరించలేమని వెంకయ్య అన్నారు. ఐఐపీఏ వంటి సంస్థలు ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలని సూచించారు. కరోనా సమయంలోనూ ఆన్ లైన్ ద్వారా శిక్షణాకార్యక్రమాలను నిర్వహించడంలో ఐఐపీఏ తీసుకున్న చొరవను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రశంసించారు. కరోనా మహమ్మారిని.. భారతదేశం వ్యూహాత్మక అప్రమత్తత, సరైన సమయంలో సరైన నిర్ణయాల కారణంగా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ విషయంలో మన దేశ  ప్రయత్నాలను ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించాయని గుర్తుచేశారు. 

ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ స్ఫూర్తితో భారతదేశ పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దే దిశగా ఐఐపీఏ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాసేవల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ‘మిషన్ కర్మయోగి’గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. సివిల్ సర్వెంట్లకు శిక్షణనిచ్చేందుకు ఐఐపీఏ సాంకేతిక ఆధారిత సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పదవీ విరమణ పొందిన సివిల్ సర్వీసు అధికారులు, విద్యావేత్తలు.. ఐఐపీఏలో సభ్యులుగా చేరడం ద్వారా సంస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందన్నారు.  గత జనవరిలో దివంగతులైన ఐఐపీఏ మాజీ చైర్మన్ టీఎన్ చతుర్వేదికి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఐఐపీఏ డైరెక్టర్ ఎస్ఎన్ త్రిపాఠి, మాజీ గవర్నర్ శేఖర్‌దత్ సహా పలువురు ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.