బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 01:21:02

పార్లమెంటుపై కరోనా ప్రభావం

పార్లమెంటుపై కరోనా ప్రభావం

  • ఉభయసభలు నిరవధిక వాయిదా
  • లోక్‌సభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం
  • బిల్లుకు 40 సవరణల్ని చేసిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం పార్లమెంటు సమావేశాలపైనా పడింది. దేశంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. షెడ్యూల్‌ కంటే రెండు వారాలు ముందే లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అయితే, వాయిదాకు ముందు ఆర్థిక బిల్లు-2020ను లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు, రాజ్యసభనూ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక ప్రతిపాదనలు పంపే ఉద్దేశంతో రూపొందించిన ఆర్థిక బిల్లు-2020కి లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం ఉండటంతో ఈ బిల్లుపై ఎలాంటి చర్చలు జరుపకూడదని అన్ని పార్టీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించామని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. దీంతోపాటు సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బిల్లుకి కేంద్రం 40కి పైగా సవరణల్ని ప్రతిపాదించిందని స్పీకర్‌ తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన కొన్ని సవరణల్ని తోసిపుచ్చినట్టు పేర్కొన్నారు. మరోవైపు, హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌ రెడ్డి మరో రెండు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు కాగా మరొకటి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ బిల్లు. అయితే, ఈ బిల్లుల నకళ్లను(కాపీలను) తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. 

సోమవారం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ మొదలైంది. చత్తీస్‌గడ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 17 మంది భద్రతా సిబ్బందికి సభ్యులు నివాళులు అర్పించారు. అలాగే సోమవారం అమరవీరుల రోజు కావడంతో స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాల్ని సభ గుర్తు చేసుకున్నది. మరోవైపు, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడు సోమవారం ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కేంద్రానికి ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచే అధికారాలు

భవిష్యత్తులో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.8 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచేందుకు వీలు కల్పించే అధికారాల్ని కేంద్రం చేజిక్కించుకున్నది. దీని కోసం ఆర్థిక బిల్లు, 2020కు సవరణలు చేసింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.18, లీటరు డీజిల్‌పై రూ. 12 ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచేందుకు కేంద్రానికి వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకూ లీటరు పెట్రోల్‌పై రూ.10, లీటరు డీజిల్‌పై రూ.4 ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకం పరిమితిగా ఉన్నది.   

జనతా కర్ఫ్యూకి సంఘీభావం

కరోనాను అడ్డుకోవడంలో భాగంగా ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూలో పేద, ధనిక అని తేడా లేకుండా దేశ ప్రజలందరూ పాల్గొనడంపై లోక్‌సభ హర్షం వ్యక్తం చేసింది. స్పీకర్‌ ఓంబిర్లా జనతా కర్ఫ్యూను ప్రస్తావించగానే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో పాటు సభలోని వారందరూ నిల్చొని ప్రజలకు, వైద్యులకు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా కృతజ్ఞతలు, అభినందనలు చెప్పేందుకు సభలోని సభ్యులు చేతులతో బల్లల్ని చరుస్తారు. నిల్చొని చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలుపడం అరుదు.


logo
>>>>>>