బుధవారం 08 జూలై 2020
National - Jun 30, 2020 , 18:58:03

ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో.. ఆన్‌లైన్‌ డిప్లొమా, బీఎస్‌ఈ కోర్సులు

 ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో.. ఆన్‌లైన్‌ డిప్లొమా, బీఎస్‌ఈ కోర్సులు

చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ కోర్సులను అందించనున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ ఈ ఆన్‌లైన్‌ డిప్లొమా, బీఎస్‌ఈ ప్రొగ్రామింగ్‌, డేటా సైన్స్‌ కోర్సులను ప్రారంభించారు. తొలి పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను భారతీయ విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జేఈఈతో సంబంధం లేకుండా ఈ కోర్సులలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు.  

కాగా, 12వ తరగతి పాసైన వారు ఎవరైనా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఎలాంటి వయో పరిమితి లేదని ఆ సంస్థ డైరెక్టర్‌ భాస్కర్‌ రామ్మూర్తి తెలిపారు. ఈ కోర్సుల ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు చేరువకావలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 12వ తరగతి పాసైన వారు పౌండేషన్‌ కోర్సు చేయాలని, డిగ్రీ చదివిన వారు నేరుగా డిప్లొమో స్థాయికి దరఖాస్తు చేయవచ్చని వివరించారు. పౌండేషన్‌ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌ను, ఒక ఏడాది డిప్లొమో కోర్సు, మూడు ఏండ్ల డ్రిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి ఆయా పట్టాలను అందిస్తామన్నారు. 

ప్రతి కోర్సును ఆరు సెమిస్టర్లుగా విభజించినట్లు ఐఐటీ మద్రాస్‌ తెలిపింది. ఈ కోర్సులకు సంబంధించిన వీడియోలు, వీక్లీ ఎసైన్‌మెంట్లు, వ్యక్తిగతంగా సమీక్షించే పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ కోర్సుల్లో చేరాలని భావించేవారు తమ అర్హత మేరకు దరఖాస్తును పూర్తి చేయాలని, అర్హత పరీక్ష కోసం రూ.3,000 రుసుము చెల్లించాలని తెలిపింది. 

ఈ కోర్సులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంగ్లీష్‌, గణితం, స్టాటిస్టిక్స్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌కు సంబంధించిన మెటిరియల్‌ను నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు వీటిని అభ్యసించి,  ఎసైన్‌మెంట్లు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. నాలుగు వారాల తర్వాత వ్యక్తిగత అర్హత పరీక్షను రాయాల్సి ఉంటుంది. 50 శాతంపైగా మార్కులు సాధించిన వారు ఫౌండేషన్ కోర్సుకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్‌ 15. మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌ onlinedegree.iitm.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.logo