ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 02:24:00

తొక్కలతోనే చక్కని మందులు

తొక్కలతోనే చక్కని మందులు

  • వ్యవసాయ ఉత్పత్తులతో చవగ్గా మందుల తయారీ
  • కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన ఐఐటీ-గువాహటి పరిశోధకులు

న్యూఢిల్లీ: ఏదైనా వ్యాధి నిర్మూలనకు ఒక ఔషధాన్ని సృష్టించాలంటే ఏండ్లతరబడి కష్టపడాలి. కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు చేసి వందలు వేల మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. ఇంత కష్టపడి ఔషధ ఫార్ములా కనుగొనటం ఒక ఎత్తయితే.. దానిని ఉపయోగించి ఔషధాలు తయారుచేయటం మరో ఎత్తు. రోజులతరబడి కెమికల్స్‌ను సరైన పాళ్లలో కలుపుతూ ఉండాలి. ముడిసరుకు నుంచి అవసరమైన పదార్థం మాత్రమే సేకరించేందుకు పలు సాల్వెంట్లను ఉపయోగించాలి. వాటిని తొలగించేందుకు మరికొన్నింటిని వాడాలి. ఈ మొత్తం ప్రక్రియకు సమయంతోపాటు డబ్బు కూడా భారీగా అవసరం. కానీ, ఈ కష్టాలన్నింటికీ చక్కని పరిష్కారం చూపారు ఐఐటీ గువాహటి పరిశోధకుడు ప్రొఫెసర్‌ మిహిర్‌కుమార్‌ పర్కాయత్‌. తన విద్యార్థి వీఎల్‌ ధాడ్జేతో కలిసి కేవలం నీళ్లతోనే ముడిపదార్థాలను శుద్ధిచేసి సమర్థవంతమైన ఔషధాలు తయారుచేసే నూతన టెక్నాలజీని ఆవిష్కరించారు. పండ్లు, పండ్ల తొక్కలు, ఉల్లిగడ్డలు, చిరు ధాన్యాలు, టీ గింజలు, ఆకులు తదతర స్వచ్ఛమైన వ్యవసాయోత్పత్తులను మాత్రమే ఉపయోగించి  మెదడు, నాడీవ్యవస్థపై ప్రభావవంతంగా పనిచేసే సైకోయాక్టివ్‌ ఔషధాలు, వయసు ప్రభావాన్ని తగ్గించే (యాంటీ ఏజింగ్‌) మందులను వీరు చవకగా తయారుచేస్తున్నారు.

నీటితోనే శుద్ధి 

ఐఐటీ గువాహటిలోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ హెడ్‌ అయిన ప్రొఫెసర్‌ మిహిర్‌కుమార్‌ పర్కాయత్‌ ధాడ్జేతో కలిసి చెరుకు రసం తీసే యంత్రంలాంటి పరికరాన్ని తయారుచేశారు. దానితో పండ్లు, పండ్ల తొక్కలు, కాయ ధాన్యాల్లో ఎంత స్థాయిలో కావాలంటే అంత వరకు నీటిని తొలగించవచ్చు. అలా  వ్యవసాయోత్పత్తుల నుంచి ఆ యంత్రం సాయంతో నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత వాటిని పొరలు పొరలుగా విడదీసి పొడి చేస్తారు. ఆ పొడిని నీటిలో వడగట్టడం ద్వారా ఔషధాలకు అవసరమైన పదార్థాలను వేరుచేస్తారు. ఇందుకోసం ఎలాంటి సాల్వెంట్లను వాడాల్సిన అవసరం లేదు. వేరు చేసిన పదార్థాలతో ఔషధాలను తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో కెమిల్స్‌, సాల్వెంట్లను వాడరు కాబట్టి అత్యంత వేగంగా ఔషధాలను తయారుచేయవచ్చని పర్కాయత్‌ తెలిపారు. ఈ పరిశోధనపై వీరు పేటెంట్‌ కూడా తీసుకున్నారు. వాణిజ్యపరంగా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.