శనివారం 11 జూలై 2020
National - Jun 26, 2020 , 08:47:25

ఐఐటీ బాంబేలో ఆన్‌లైన్ బోధ‌న!‌

ఐఐటీ బాంబేలో ఆన్‌లైన్ బోధ‌న!‌

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఐఐటీ బాంబే నిర్ణయించింది. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే తరగతులు బోధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్లడించింది. ఐఐటీ–బాంబే డైరెక్టర్‌ సుభాశీశ్‌ ఛౌధురి ఈ మేరకు గురువారం ఒక ప్రకటన చేశారు. సంస్థ సెనేట్‌లో చర్చించాక వచ్చే సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని నిర్ణయించామ‌ని, విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ విషయంలో రాజీ పడబోమ‌ని చెప్పారు. దీంతో దేశంలోని మిగతా ఐఐటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే  అవకాశాలున్నాయి.  

కాగా, తమ సంస్థ‌లో ఆర్థికంగా బలహీనవర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నందున దాత‌లు ముందుకు వ‌చ్చి వారికి ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవసరమైనవి సమకూర్చాల‌ని ఛౌధురి కోరారు. విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను సమీక్షించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో బాంబే ఐఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. 


logo